Income Tax Rules : టాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. పాన్ కార్డు నుంచి HRA వరకు.. ఏప్రిల్ 1 నుంచి రాబోయే కీలక మార్పులివే..!
Income Tax Rules : ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో HRA, STT, పాన్ కార్డ్‌కు సంబంధించి అనేక నిబంధనలు మారబోతున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Income Tax Rules
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి
- పాన్ కార్డు, హెచ్ఆర్ఏ వంటి అనేక ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
Income Tax Rules : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలువుతుంది. ఫస్ట్ తేదీ నుంచే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అనేక నిబంధనలు మారనున్నాయి.
పన్నుచెల్లింపుదారులు, సామాన్యులపై నేరుగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ (HRA) నుంచి పాన్ (PAN) కార్డుల వరకు పన్ను సంబంధిత నిబంధనల వరకు చాలావరకూ మారనున్నాయి. ఇంతకీ ఏయే రూల్స్ మారనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1 : ఆదాయపు పన్ను చట్టం 2025 అమలు :
దశాబ్దాల నాటి పన్ను నిబంధనలను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టంలో అనేక అనవసరమైన సెక్షన్లను తొలగించి మరికొన్నింటిని పన్నుచెల్లింపుదారులకు అర్థమయ్యేలా అందుబాటులోకి తెచ్చింది.
2: ఇకపై టాక్స్ ఇయర్ :
ఆర్థిక సంవత్సరం, మదింపు సంవత్సరాన్ని ఇకపై పన్ను సంవత్సరంగా పిలుస్తారు. పన్ను చెల్లింపుదారుల మనస్సులలోని గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఇలా పేరులో మార్పులు చేసింది.
3 : ఐటీఆర్ గడువు :
జీతభత్యాలు పొందే ఉద్యోగులకు (ITR-1,ITR-2) గడువు జూలై 31వ తేదీగానే ఉంటుంది. నాన్-ఆడిట్ కేసుల (ITR-3, ITR-4) గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు.
4 : ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడర్లపై భారీ ఖర్చులు :
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)లో కీలక మార్పు జరిగింది. ఫలితంగా, F&O పెట్టుబడిదారులు ఇప్పుడు అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. STTని 0.12 శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు.
5 : హెచ్ఆర్ఏ నిబంధనలు కఠినతరం :
కొత్త నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ మినహాయింపులు కొనసాగుతాయి. కానీ, అదనపు పత్రాలు అవసరమవుతాయి. ఉద్యోగులు ఇప్పుడు తమ ఇంటి యజమాని పాన్ కార్డ్, అద్దె పేమెంట్లకు సంబంధించి వ్యాలీడ్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
6 : మీల్ కార్డ్ లిమిట్ పెంపు :
యజమాని అందించే మీల్ కార్డులపై పన్ను రహిత పరిమితిని రూ. 50 నుంచి రూ. 200కి పెంచారు. ఈ ప్రయోజనం పాత పన్ను విధానం కింద ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది.
7 : రూ. 15వేల వరకు గిఫ్ట్స్, వోచర్లు :
ఏప్రిల్ 1, 2026 నుంచి కార్పొరేట్ గిఫ్ట్ కార్డ్‌లు, వోచర్లు, కూపన్లపై పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 15వేలకు పెంచారు. ఈ మినహాయింపు పాత, కొత్త పన్ను విధానాలు రెండింటికి వర్తిస్తుంది.
8 : విద్యా భత్యం పరిమితి పెంపు :
కొత్త నిబంధనల ప్రకారం.. విద్యా భత్యం పరిమితిని నెలకు రూ. 100 నుంచి రూ.3వేలకు పెంచారు. హాస్టల్ భత్యాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 9వేలకు పెంచారు.
9 : సావరిన్ గోల్డ్ బాండ్స్ :
ఒక వ్యక్తి సెకండరీ మార్కెట్ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే.. మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటారు. ఈ బాండ్లను జారీ కాలంలో కొనుగోలు చేస్తే వాటికి మినహాయింపు కొనసాగుతుంది.
10 : పాన్ కార్డ్ నిబంధనలలో మార్పులు :
పాన్ కార్డులు పొందే నిబంధనలలో కీలక మార్పు.. గతంలో పాన్ కార్డులను కేవలం ఆధార్ ద్వారా మాత్రమే పొందేవారు. ఇకపై వ్యక్తులు లేదా సంస్థలు తమ కేటగిరీలలో పాన్ కార్డులను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక ఏడాదిలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి.
11 : ప్రమాద కేసులపై నో టాక్స్ :
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నుంచి అందుకున్న పరిహారంపై ఎలాంటి టీడీఎస్ (TDS) కట్ కాదు. ఇకపై పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి.
