SSY Scheme : మీకు ఆడపిల్ల ఉందా? ఈ ప్రభుత్వ పథకంలో రూ. 1. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఎన్ని ఏళ్లలో రూ. 72 లక్షలు చేతికి అందుతాయంటే?
Sukanya Samriddhi Yojana : మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఈ ప్రభుత్వ సుకన్య సమృద్ధి యోజన పథకంలో రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఎన్ని ఏళ్లలో 72 లక్షల రాబడి వస్తుందో తెలుసా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sukanya Samriddhi Yojana
- ఆడిపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం
- పదేళ్ల వయస్సులో రూ. 1.5 లక్షల పెట్టుబడి పెడితే చాలు
- ఎన్ని ఏళ్లకు రూ. 72 లక్షల రాబడి చేతికి అందుతాయంటే?
Sukanya Samriddhi Yojana : మీకు ఆడపిల్ల పుట్టిందా? అయితే, ఇప్పుడే పాప పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే చాలామంది డబ్బులు కూడబెడుతుంటారు.
అదే మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెడితే ఆ డబ్బులు మీ ఆడపిల్లల చదువు, పెళ్లినాటికి చేతికి వస్తాయి. ఈ సేవింగ్స్ స్కీమ్ ప్రభుత్వ హమీ పథకం.. ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఈ పథకంలో కనీస పెట్టుబడి ఏడాదికి రూ. 250 కాగా, టాప్ లిమిటెడ్ ఏడాదికి రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు . ప్రస్తుతం SSY వడ్డీ రేటు ఏడాదికి 8.2శాతంగా ఉంది. 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏ ఆడపిల్లకైనా SSY అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
అయితే, తల్లిదండ్రుల్లో ఒక సందేహం వ్యక్తమవుతోంది. ఒకవేళ 10 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే SSY అకౌంట్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SSY మెచ్యూరిటీ నిబంధనలేంటి? :
సుకన్య సమృద్ధి యోజనకు 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలం ఉంటుంది. అకౌంట్ మెచ్యూర్ అయ్యేటప్పుడు అమ్మాయి వయస్సును పరిగణనలోకి తీసుకోదు. ఒకవేళ తల్లిదండ్రులు తమ కుమార్తెకు పుట్టిన సమయంలో SSY అకౌంట్ ఓపెన్ చేస్తే.. ఆమెకు 21 ఏళ్లు నిండినప్పుడు ఆ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.
అదేవిధంగా, అమ్మాయికి 10 ఏళ్ల వయస్సులో SSY అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ 21 ఏళ్ల తర్వాత అంటే ఆమెకు 31 ఏళ్లు నిండినప్పుడు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.
SSY పథకం ముఖ్య విషయాలివే :
‘బేటీ బచావో, బేటీ పఢావో’ క్యాంపెయిన్ కింద 2015 జనవరి 22న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్ స్కీమ్ ద్వారా ఆడపిల్లల విద్య, పెళ్లి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. పెళ్లి నాటికి అయ్యే ఖర్చులను కూడా ఈ ఫండ్స్ వినియోగించవచ్చు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు SSY ఖాతాను ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు.
ఒక్కో ఆడపిల్లకు ఒక SSY అకౌంట్ తీసుకోవాలి. ఒక ఫ్యామిలీలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే రెండు అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. అయితే, కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టిన సందర్భాలలో సంబంధిత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే రెండు కన్నా ఎక్కువ SSY అకౌంట్లను అనుమతిస్తారు.
ఈ ఖాతాను దేశంలో ఎక్కడైనా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు :
మీ ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ssy ఖాతాను తల్లిదండ్రులు/సంరక్షకులు నిర్వహిస్తారు. సంరక్షకులు సేవింగ్స్ మానిటరింగ్ చేస్తారు. ఆ ఫండ్స్ పిల్లల విద్య, భవిష్యత్ అవసరాల కోసం వినియోగించవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాదారు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి స్వయంగా అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు.
SSY అకౌంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
- సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రారంభ ఫారమ్, బ్యాంకులు, పోస్టాఫీసులో ఓపెన్ చేయొచ్చు.
- ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం
- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆధార్ నంబర్
- పాన్ కార్డు లేదా ఫారం 60
SSY పథకంలో రూ. 72 లక్షలు ఎలా సంపాదించాలి ? :
సుకన్య సమృద్ధి యోజనను ఉపయోగించి రూ. 72 లక్షలు ఎలా సంపాదించాలో తెలుసుకునే ముందు మీరు కేవలం 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే సరిపోతుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. మీరు 15 ఏళ్ల పాటు ప్రతి ఏడాదిలో రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది.
అయితే, మొత్తం వడ్డీ పూర్తి 21 ఏళ్లలో లభిస్తుంది. 21 ఏళ్లలో సంపాదించిన మొత్తం వడ్డీ రూ. 49,32,119 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం రూ. 71,82,119 అవుతుంది.
