TCS Share Price : చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా షేర్లు ఢమాల్! ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా టెన్షన్
TCS Share Price : టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వార్త స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయి టాటా గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
N Chandrasekaran
- టాటా గ్రూప్‌కు ఊహించని షాక్
- చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటనతో షేర్ల పతనం
- టీసీఎస్ నుంచి టాటా మోటార్స్ వరకు స్టాక్స్ కుదేలు
- బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పతనం
- టీసీఎస్ షేర్లు 5శాతం పతనం
TCS Share Price-Tata Sons Chairman : టాటా గ్రూప్‌కు ఊహించని షాక్ ఎదురైంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఈ వార్తతో స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పడిపోయి 24,300 పాయింట్ల దిగువకు చేరింది.
టాటా గ్రూప్ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. గ్రూప్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించే కంపెనీ టీసీఎస్ షేర్లలో భారీ పతనం కనిపించింది. ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ ఏజీఎంకు ముందే చంద్రశేఖరన్ రాజీనామా చేశారు.
టీసీఎస్ షేర్లు 5శాతానికి పైగా పడిపోయి రూ. 2,301.10కి చేరాయి. గత సెషన్లో రూ. 2,440.20 వద్ద ముగిసిన ఈ షేరు ఈరోజు రూ.2,448.70 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు కూడా 4శాతం పడిపోగా, టాటా కన్స్యూమర్, టాటా పవర్ షేర్లు ఒక్కొక్కటి సుమారు 2శాతం చొప్పున తగ్గాయి.
చంద్రశేఖరన్ రాజీనామా :
1987లో ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత 2009లో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు. అలాగే 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. 2022లో రెండోసారి కూడా ఆయనే నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి 24న చంద్రశేఖరన్ మూడోసారి ఛైర్మన్‌గా కొనసాగే విషయంపై టాటా సన్స్ బోర్డు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
గ్రూప్ కొత్త వ్యాపారాల పనితీరుపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖరన్ పదవీకాలంలో టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, డిజిటల్ వ్యాపారాలు వంటి కొత్త రంగాలలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 2027 వరకు ఛైర్మన్‌గా ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారు.
63 ఏళ్ల చంద్రశేఖరన్, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి పలు టాటా గ్రూప్ కంపెనీలకు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆగస్టు 18న ఏజీఎం సమావేశం జరగనుండగా టాటా సన్స్‌లో సుమారు 66శాతం వాటాతో టాటా ట్రస్ట్‌ల ఓటింగ్ సరళిపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. చంద్రశేఖరన్‌కు పదవీకాలాన్ని పొడిగించేందుకు టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ నోయెల్ టాటా కూడా సుముఖంగా లేరని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
