BITS Pilani : బిట్సాట్ ర్యాంకర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇలాచేస్తే నాలుగేళ్లు 100శాతం స్కాలర్షిప్
BITS Pilani Scholarship : ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ (BITS Pilani) తీపి కబురు అందించింది.
Bits Pilani Scholarship 2027 Top 1000 Bitsat Rankers
BITS Pilani Scholarship : ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ (BITS Pilani) తీపి కబురు అందించింది. ప్రతిభావంతులైన విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి బిట్స్ ప్రవేశ పరీక్ష (BITSAT 2027)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తొలి 1,000 మంది విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి. రామ్‌గోపాల్‌రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిట్స్ ప్రవేశ పరీక్షల్లో (BITSAT 2027) తొలి 1,000 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ అందించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలలోపు ఉండాలి. అంటే మెరిట్‌తో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా స్కాలర్షిప్ అర్హతలో పరిగణనలోకి తీసుకోనున్నారు.
స్కాలర్షిప్కు అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అయితే, ఈ ప్రయోజనం కొనసాగాలంటే ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 7.5 సీజీపీఏ (CGPA) సాధించాల్సి ఉంటుంది. నిర్దేశించిన అకడమిక్ ప్రమాణాలను కొనసాగించినప్పుడే నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ ప్రయోజనం అందుతుంది.
స్కాలర్షిప్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని బిట్స్ పిలానీ స్పష్టం చేసింది. అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియలో భాగంగానే స్కాలర్షిప్ కేటాయిస్తారు. దీంతో ప్రవేశం పొందిన తర్వాత స్కాలర్షిప్ కోసం విడిగా దరఖాస్తు చేసుకునే ఇబ్బంది ఉండదు.
బిట్స్ పిలానీ క్యాంపస్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా BITSAT పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లైన బీఈ (BE), ఎమ్మెస్సీ (MSc), బీఫార్మా (BPharm) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2027 ప్రవేశాల నుంచి కొత్త స్కాలర్షిప్ విధానం అమల్లోకి రానుంది.
