Bengaluru IT Jobs : బెంగళూరులో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్.. ఐటీ ఉద్యోగాలపై కొత్త వివాదం!

Bengaluru IT Jobs : బెంగళూరు ఐటీ రంగంలో స్థానికులు వర్సెస్ వలసదారుల వివాదం ముదురుతోంది. కన్నడిగులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.. కర్ణాటక ప్రభుత్వ కోటా ప్రతిపాదనలు, ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి..

Karnataka Local Job Quota

  • కన్నడిగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేంటూ ప్రభుత్వం హెచ్చరిక
  • ఐటీ ఉద్యోగాలపై లోకల్ వార్.. బెంగళూరులో ముదురుతున్న వివాదం
  • ఏఐతో ఉద్యోగాలకు కోత.. మరోవైపు స్థానికుల కోటా డిమాండ్

Bengaluru IT Jobs : బెంగళూరు ఐటీ రంగంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఒకవైపు టెక్ కంపెనీల్లో నియామకాలు తగ్గి, ఉద్యోగాల కోతలు పెరుగుతుంటే.. మరోవైపు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ రాజకీయంగా వేడెక్కుతోంది. కన్నడిగులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి.

కన్నడిగులకు అన్యాయం జరిగితే ఊరుకోం :
కర్ణాటకలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కాల్సిందేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గట్టిగా చెబుతున్నారు. కన్నడిగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, కర్ణాటకలో మాత్రం ఇతర ప్రాంతాల ఇంజినీర్లను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నారంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి..

నిజానికి, ఈ అంశం ఇప్పటిది కాదు.. 2024లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ కోటా కల్పించే బిల్లును ప్రతిపాదించింది. మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 50 శాతం, ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఆ ప్రతిపాదనలో కీలక అంశం.

Read Also : SBI Credit Card : మీకు SBI క్రెడిట్ కార్డు ఉందా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లావాదేవీలు చేస్తే జేబుకు చిల్లు!

కంపెనీల్లో ఆందోళన ఇదే : 
అయితే, పరిశ్రమల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇలాంటి నిబంధనలు అమలు చేస్తే పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు, రాయితీలతో లాభపడుతున్న కంపెనీలు స్థానికులకు కూడా తగిన అవకాశాలు కల్పించాలని కొందరు నేతలు వాదిస్తున్నారు. అయితే, ఉద్యోగాల్లో స్థానికతను తప్పనిసరి చేయడం రాజ్యాంగ హక్కులు, ప్రతిభ ఆధారిత నియామకాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఇదిలా ఉంటే, ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత ఇప్పటికే సవాలుగా మారింది. ప్రముఖ కంపెనీలు నియామకాలను తగ్గించడం, ఉద్యోగాల కోతలు చేపట్టడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.

రాజకీయంగా చూస్తే.. కన్నడ భాష, ప్రాంతీయ గౌరవం, స్థానిక ఓటర్ల మద్దతు ఈ వివాదంలో కీలకంగా కనిపిస్తున్నాయి. అయితే, ఉద్యోగాల సంఖ్య తగ్గుతున్న పరిస్థితుల్లో స్థానికులు, వలసదారుల మధ్య పోటీని పెంచడం పరిష్కారమా? లేక నైపుణ్యాలకు తగ్గ అవకాశాలు పెంచడమే అసలైన మార్గమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..