CBSE
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి వార్షిక పరీక్షల్లో ఓపెన్ బుక్ పరీక్షలను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు తాజాగా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు పైలట్ అధ్యయనం ఆధారంగా ఆమోదం లభించింది.
బోర్డు అత్యున్నత నిర్ణయాధికారి మండలి సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ 2025 జూన్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశ మినిట్స్ ప్రకారం.. ఈ ప్రతిపాదనలో 9వ తరగతిలో “ప్రతి టర్మ్‌లో మూడు పెన్-పేపర్ పరీక్షల్లో భాగంగా” ఓపెన్ బుక్ పరీక్షలను చేర్చే అంశం ఉంది. ఇవి భాష, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం వంటి ప్రధాన విషయాలను కవర్ చేస్తాయి.
రిపోర్టుల ప్రకారం.. ఎంపిక చేసిన పాఠశాలల్లో పైలట్ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలో ఉంది. ఇందులో 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్, గణితం, సైన్స్.. 11, 12 తరగతుల్లో ఇంగ్లిష్, గణితం, జీవశాస్త్రం అంశాలను కవర్ చేస్తారు. విద్యార్థులు పరీక్ష పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని అంచనా వేయడమే దీని ఉద్దేశం.
ఈ ప్రతిపాదన 2023 జాతీయ పాఠ్య ప్రణాళికా రూపకల్పన (NCFSE) ప్రకారం అమలు అవుతోంది. దీన్ని 2020 జాతీయ విద్యా విధానం (NEP) ఆధారంగా రూపొందించారు. NCFSE ప్రకారం ఓపెన్ బుక్ పరీక్ష అంటే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు పాఠ్యపుస్తకాలు, తరగతి నోట్స్, లైబ్రరీ పుస్తకాలు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.
ఓపెన్ బుక్ పరీక్ష అంటే విద్యార్థులు పాఠ్యాంశాలను గుర్తుంచుకోవడంపై కాకుండా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడటం, విశ్లేషించడం, వివిధ సందర్భాల్లో అన్వయించగలిగే సామర్థ్యాన్ని పరీక్షించడం.
సీబీఎస్ఈ ఓపెన్ బుక్ పరీక్షా విధానాన్ని అనుసరించడం తొలిసారి కాదు. 2014లో సీబీఎస్ఈ రోట్ లర్నింగ్ (పాఠాన్ని అర్థం చేసుకోకుండా పదే పదే చదివి గుర్తుపెట్టుకోవడం)ను తగ్గించేందుకు, సమాచారం ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం పెంచేందుకు OTBA (Open Text Based Assessment)ను ప్రవేశపెట్టింది.
ఇది 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, విజ్ఞానం, సామాజిక శాస్త్రం, 11వ తరగతి తుది పరీక్షల్లో ఆర్థికశాస్త్రం, జీవశాస్త్రం, భూగోళశాస్త్రం విషయాలకు అమలు చేశారు. విద్యార్థులకు 4 నెలల ముందుగానే రిఫరెన్స్ మెటీరియల్ ఇచ్చారు. కానీ, 2017-18లో సీబీఎస్ఈ OTBAని నిలిపివేసింది. విద్యార్థుల్లో తాత్విక సామర్థ్యాలు (క్రిటికల్ అబిలిటీస్) సమర్థవంతంగా అభివృద్ధి కాలేదని పేర్కొంది.