Exams Memory Boosting Foods : పరీక్షల వేళ.. ఈ ఆహారం తింటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. ఎగ్జామ్స్ లో విజయం మీదే..!
Exams Memory Boosting Foods : పరీక్షల వేళ విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏం తింటే ఏకాగ్రత పెరుగుతుంది అంటే..
- Dharani Pilli
- Published On : March 9, 2026 / 12:38 PM IST
Exams time students take food that boost brain and memory details here
Exams Memory Boosting Foods : తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పరీక్షలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. మరికొన్ని రోజుల్లో పదో తరగతి ఎగ్జామ్స్ మొదలవుతాయి. అయితే పరీక్షల కోసం కష్టపడి చదవడం ఎంత ముఖ్యమో.. అలా చదివిన చదువు గుర్తుండి పోవాలంటే.. తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా సందర్భాల్లో మాదిరి పరీక్షల ముందు కూడా ఇష్టమొచ్చినట్లు తింటే అవి మెదడు, మనసు, శరీరం పైన ప్రభావం చూపి.. కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులను కలగజేస్తాయి. అందుకే పరీక్షల వేళ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల వేళ కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరిగి ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. మరి ఆ ఆహారాలు ఏవంటే..
పరీక్షల సమయంలో మెదడు చురుగ్గా పని చేయాలంటే.. ఏకాగ్రతగా చదువుకోవాలన్నా ఇప్పుడు చెప్పే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
- ఆకుకూరలు: పరీక్షల వేళ ఆకుకూరలు తింటే చాలా మంచిది. మరీ ముఖ్యంగా పాలకూర వంటివి తీసుకుంటే వీటిలో ఉండే విటమిన్ కే, లూటిన్, ఫోలేట్ వంటివి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
- బెర్రీలు, పండ్లు: పరీక్షల సమయంలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పళ్లు తింటే మంచిది. వీటిలో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- గింజలు, విత్తనాలు: బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజల్లో మెదడుకు కావలసిన విటమిన్ ఇ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కనుక పరీక్షల వేళ తప్పకుండా వీటిని తినాలి.
- గుడ్లు: గుడ్లలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యం. అందుకే పరీక్షల వేళ ప్రతిరోజూ కచ్చితంగా గుడ్డు తినాలి.
- డార్క్ చాక్లెట్, కాఫీ: పరీక్షల వేళ మితంగా కాఫీ తాగొచ్చు. కాఫీ ఏకాగ్రతను పెంచితే, డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- చేపలు: సాల్మన్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- నీరు, ద్రవ పదార్థాలు: వేసవి కాలం ప్రారంభం అయ్యింది. విపరీతమైన ఎండ కాస్తుంది. ఇలాంటి వేళ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకే తరచుగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటుండాలి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి మెదడును చురుకుగా ఉంచుతాయి.
పరీక్షల వేళ తప్పక చేయాల్సిన పనులు
- బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి: పరీక్ష రోజున ఉదయం పోషకాహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
- చక్కెర పదార్థాలు వద్దు: అధిక చక్కెర ఉన్న ఆహారాలకు బదులుగా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
- నిద్ర: రాత్రిపూట సరిపడా నిద్ర పోవడం అనే అలవాటు.. జ్ఞాపకశక్తిని పదిలపరుచుకోవడానికి సహాయపడుతుంది.
- నూనె పదార్థాలు, బయట ఆహారం వద్దు: పరీక్షల వేళ నూనెలో వేయించిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
