COVID 19 Cicada : కోవిడ్ కొత్త వేరియంట్ సికాడా.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎంత ప్రమాదకారి అంటే..
COVID 19 Cicada : కోవిడ్ మహమ్మారి పూర్తిగా ప్రపంచం నుంచి వెళ్లిపోలేదు. ప్రస్తుతం కోవిడ్ 19 వేరియంట్ సికాడా వెలుగు చూసింి
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 10:34 AM IST
new covid 19 variant cicada symptoms and precautions treatment full details
COVID 19 Cicada : కోవిడ్ ఏడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. దీని ధాటికి తాళలేక ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ పాటించాయి. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ వచ్చినా.. జనాలు ముందంత భయపడలేదు, తట్టుకోగలిగారు. ఈ క్రమంలో మరోసారి కోవిడ్ పేరు తెరమీదకు వచ్చింది. గత కొంతకాలంగా “కోవిడ్ సికాడా” అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కోవిడ్-19 వైరస్‌లోని కొత్త ఉప వేరియంట్ (Sub-variant) పేరు. ఇది ప్రధానంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కుటుంబంలో ఉన్న BA.3.2 మ్యూటేషన్లతో సంబంధం కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సికాడా పేరు ఆకర్షణీయంగా ఉండటమే కాక.. ఇది పెద్దగా భయపడాల్సిన వేరియంట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు GISAID వంటి ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు “సికాడా”గా పిలుస్తున్న ఈ ఉప వేరియంట్‌ను గమనిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ తీవ్రమైన సమస్యలు కలిగించదని చెబుతున్నారు.
ఈ వేరియంట్ గురించి బెంగళూరు కిమ్స్ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ మహేష్ కుమార్ జె.ఎం మాట్లాడుతూ.., “BA.3.2 వేరియంట్‌లో సుమారు 75 మ్యూటేషన్లు ఉన్నాయి. ఇది పాత ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ మార్పులు వైరస్‌కు మన ఇమ్యూన్ సిస్టమ్‌ను (రోగనిరోధక శక్తి) తప్పించుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. అయితే ఈ వేరియంట్.. పాత వేరియంట్లలో కనిపించినట్టు ఊపిరితిత్తుల సమస్యలు, న్యుమోనియా వంటి తీవ్రమైన పరిస్థితులు కల్పించలేవు” అని అన్నారు.
లక్షణాలు ఏమిటి..
- ఈ BA.3.2 వేరియంట్ వల్ల సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి. అవి:
- ముక్కు దిబ్బడ
- గొంతు నొప్పి
- తేలికపాటి జ్వరం
- ఒంటి నొప్పులు
ఇవి సాధారణంగా 5 – 7 రోజుల్లో తగ్గిపోతాయి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా అరుదుగా మాత్రమే ఉంటుందని తెలిపారు.
కాకపోతే ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే మెట్రోలు, బస్సులు, మార్కెట్లు, మాల్స్ వంటి చోట్ల ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. ఈ వేరియంట్‌కు సంబంధించి మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దీనికి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుందంటున్నారు. దీనికి యాంటీబయాటిక్స్, ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే.. ఇంటి వద్దే సాధారణ మందులతో, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు నయమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకపోతే అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
