Nithin Narne: ఎన్టీఆర్ బావమరిది నటుడు నితిన్ నార్నేకి షూటింగ్ లో ప్రమాదం.. భుజానికి తీవ్ర గాయం
సినిమా షూటింగ్లో కుడి భుజానికి గాయం కావడంతో నటుడు నితిన్ నార్నేకు(Nithin Narne) హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స.
Actor nithin narne suffers shoulder injury during movie shoot undergoes
Nithin Narne: ప్రముఖ నటుడు, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే ఈరోజు ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి భుజానికి గాయం కావడంతో వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన వెంటనే స్పందించిన వైద్య బృందం ఆయనకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో డాక్టర్ ఈశ్వర్ పటేల్, డాక్టర్ హరికృష్ణ బచ్చు, డాక్టర్ మధుసూదన్లతో కూడిన నిపుణుల బృందం నితిన్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేసింది.
ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం.. పుకార్లు నమ్మవద్దన్న కిమ్స్ వైద్యులు:
శస్త్రచికిత్స అనంతరం నితిన్ నార్నే(Nithin Narne) వేగంగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తి నిలకడగా ఉందని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ, పునరావాసం (Rehabilitation) అవసరమని వైద్యులు సూచించారు. కాగా, నటుడి కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించి అభిమానులు, ఇతరులు ఆసుపత్రి వద్దకు రావద్దని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనవసర వదంతులను, పుకార్లను నమ్మవద్దని కోరింది.
