మైకులు మూగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. ప్రచార సభలు ఉండవు. నాయకులు, కార్యకర్తలు కనబడరు. అంతా సైలెంట్ కానుంది.
మైకులు మూగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. ప్రచార సభలు ఉండవు. నాయకులు, కార్యకర్తలు కనబడరు. అంతా సైలెంట్ కానుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరెత్తించిన ప్రచారం సమాప్తం కానుంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి మంగళవారం(ఏప్రిల్ 9, 2019) సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులుగా చేస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కొద్ది రోజులుగా చెవులకు చిల్లులు పడేలా వినిపించిన మైకులు మూగబోనున్నాయి. నిత్యం జెండాలు పట్టుకుని తమ అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేసే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఇక కనబడరు. ఎన్నికల ప్రచార సభలు ఇక ఉండవు. బహిరంగసభలు, ర్యాలీలను రాజకీయ పార్టీలు తెర దించాల్సిందే.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి
పోలింగ్ ముగిసే సమయానికి 48గంటల ముందు ప్రచారం నిర్వహించకూడదన్న నిబంధన అమల్లోకి రానుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ‘లంచం ఇవ్వడం’గా పరిగణించి శిక్షిస్తారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి ‘సి విజిల్’ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వివరాలు రహస్యంగా ఉంచుతామని, ఫిర్యాదుపై వంద నిమిషాల్లోనే అధికారులు దర్యాప్తు పూర్తి చేస్తారని సీఈవో తెలిపారు.
ప్రచారమే కాదు ప్రకటనలు కూడా బంద్ కానున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం(ఏప్రిల్ 9, 2019) సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని ఎన్నికల అధికారులు తెలిపారు. 10, 11 తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంసీఎంసీ కమిటీ ఇచ్చిన అనుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలతోనే ముగిసిపోతుందన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలన్నారు.
వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పార్టీలు మీడియాలో, సోషల్ మీడియాలో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియా, సోషల్ మీడియాలో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే