Telangana
తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పొలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పొలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 905 సహకార సంఘాలు ఉండగా 157 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. 748 సంఘాలకు పోలింగ్ జరుగుతోంది.
మొత్తం 11 వేల 654 వార్డులకు గానూ 5 వేల 4 వందల 6 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 6 వేల 2 వందల 48 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
మొత్తం 11లక్షల 48 వేల 759 మంది రైతులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 747 కేంద్రాల్లో 6వేల 248 పొలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పొలింగ్, లెక్కింపుకు కలిపి మొత్తం 30 వేలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత… 2గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గంట లేదా రెండు గంటల్లోపు ఫలితాలు వెలువడతాయి. ఆ వెంటనే ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగనుంది. డైరెక్టర్ల ఎన్నికల పూర్తికాగానే… రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలుంటాయి.
పేరుకు సహకార సంఘాల ఎన్నికలైనా… పార్టీలు వాటికి రాజకీయ రంగును పులిమాయి. పలు పార్టీలకు చెందిన నేతలు తమ బంధువులను, కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపారు. వారి గెలుపు కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సహకార ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.