హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) భారతదేశం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా రూ. 21లక్షలతో చెత్త సేకరణ కోసం 9 ఎలక్ట్రిక్ ఆటోరిక్షా (ఈ-ఆటో)లను జీహెచ్‌ఎంసీకి అందజేసింది.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్
మార్చి 5 కవాడిగూడలోని ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్..జోనల్ కమిషనర్లు డి.హరిచందన, రఘుప్రసాద్, పవర్ గ్రిడ్ సీజీఎం రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతు..స్వచ్ఛత, పరిశుభ్రత కోసం ప్రజల్లో మార్పు వస్తేనే నగర వీధుల్లో మార్పు వస్తుందని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారం చాలా అవసరమన్నారు.
పవర్ గ్రిడ్ సంస్థ సీజీఎం రవీందర్ మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై నగరాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ-ఆటో రిక్షాలను తాము హైదరాబాద్ నగరంలో తొలిసారిగా జీహెచ్‌ఎంసీకి అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ మియాపూర్, బాలానగర్ మెట్రో రైల్ స్టేషన్‌లలో వాహనాలకు ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గత 8 నెలలుగా అవి విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి సర్కిల్ 15 డీసీ ఉమాప్రసాద్, వైద్యాధికారి భార్గవ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’