భానుడి భగభగలు

Heavy Sunny Telangana 8152

హైదరాబాద్ : తెలంగాణలో ఎండ‌లు మండుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణలో పలుచోట్ల ప‌గ‌టి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.

కడపలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ 42.1, ఆదిలాబాద్ 41.8, కరీంనగర్ 41, మహబూబ్ నగర్ లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, సూర్యపేట 39.5, హన్మకొండ 39.4, హైదరాబాద్ 39.2, రామగుండం 38.7, ఖమ్మంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

మరోవైపు అతినీలలోహిత కిరణాల సూచీ పది పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాల తాకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల బారిన పడటం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.