Open Air Party Zone: నెక్లెస్ రోడ్లో ‘ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్’.. రూ.1.20 కోట్లతో భారీ స్టేజ్.. హెచ్ఎండీఏ సరికొత్త ప్లాన్
నెక్లెస్ రోడ్ పరిసరాల్లో వేడుకలు జరుపుకోవడానికి వీలుగా మరో అద్భుతమైన ఈవెంట్ జోన్(Open Air Party Zone)ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది.
Hmda to develop open air party zone at lake view park near necklace road
-
ఐమ్యాక్స్ ఎదురుగా ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్.
-
నాలుగు నెలల్లో అందుబాటులోకి కొత్త ఈవెంట్ జోన్.
-
రూ.1.20 కోట్లతో అత్యాధునిక వసతుల నిర్మాణం.
Open Air Party Zone: హైదరాబాద్ నగరవాసులకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) కీలక నిర్ణయం తీసుకుంది. నెక్లెస్ రోడ్ పరిసరాల్లో వేడుకలు జరుపుకోవడానికి వీలుగా మరో అద్భుతమైన ఈవెంట్ జోన్(Open Air Party Zone)ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. ప్రసాద్స్ ఐమ్యాక్స్ థియేటర్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న ప్రముఖ ‘లేక్ వ్యూ పార్క్’ను భారీ ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
లేక్ వ్యూ పార్క్ ఎంపికకు కారణం ఇదే:
హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రదేశాలలో లేక్ వ్యూ పార్క్ ఒకటి. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో రెండు అందమైన కొలనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది వాకర్స్, సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం, ఈవెంట్లకు ఎంతో అనువుగా ఉంటుందని హెచ్ఎండీఏ భావించింది. గతంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన రాక్ గార్డెన్ ఈవెంట్ జోన్‌కు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల దానిని తొలగించారు. ఆ లోటును భర్తీ చేస్తూ సరికొత్త హంగులతో ఇక్కడ సరికొత్త జోన్‌ను తీసుకురానున్నారు.
రూ. 1.20 కోట్లతో బిగ్ స్టేజ్, లగ్జరీ వసతులు:
ఈ ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్ ప్రాజెక్టు కోసం హెచ్ఎండీఏ ఏకంగా రూ. 1.20 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఎంగేజ్మెంట్లు, వెడ్డింగ్ డిన్నర్లు, బర్త్‌డే వేడుకలు, కార్పొరేట్ పార్టీలు చేసుకునేందుకు వీలుగా దీనిని అద్భుతమైన డిజైన్లతో నిర్మించనున్నారు. ఇందులో భారీ స్టేజ్, అత్యాధునిక గ్రీన్ రూమ్స్, టాయిలెట్లు, చుట్టూ బౌండరీ వాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే నాలుగు ఐదు నెలల్లోనే పనులు పూర్తి చేసి, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ ఈవెంట్ జోన్ ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వేదిక దొరకడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరనుంది.
