Green Tankers: హైదరాబాద్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. కేవలం రూ.400 కే ట్యాంకర్.. ఈ నంబర్ కి డయల్ చేయండి!
హైదరాబాద్‌లో నీటి కొరతను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ‘గ్రీన్ ట్యాంకర్లను(Green Tankers)’ అందుబాటులోకి తెచ్చింది.
Hyderabad water crisis hmwssb launches green tankers for recycled sewage water
Green Tankers: ఎల్‌నివో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో భాగ్యనగరంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నివో పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని హెచ్చరించిన జీహెచ్ఎంసీ, నీటిని వృథా చేసేవారిపై భారీ జరిమానాతో పాటు కనెక్షన్ రద్దు వంటి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసిన మురుగునీటిని నిత్యావసరాలు మినహా ఇతర పనులకు సరఫరా చేసేందుకు జలమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు.
గ్రీన్ ట్యాంకర్ల సరఫరా విధానం.. ఏయే అవసరాలకు వాడుకోవచ్చంటే?
తొలి విడతగా 21 గ్రీన్ ట్యాంకర్లను(Green Tankers) అందుబాటులోకి తీసుకురాగా, కేవలం డెలివరీ ఛార్జీల ఆధారంగా ఈ నీటిని సరఫరా చేయనున్నారు. భవనాల క్యూరింగ్, తోటపని, స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణ రంగానికి సంబంధించి రోజువారీ అవసరాలకు ఈ శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవచ్చు. నగరంలోని 45 ప్రాంతాల్లో ఉన్న ఎస్టీపీ (STP) కేంద్రాల ద్వారా రోజూ 1,500 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, 27 ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా 646 ఎంఎల్డీ నీటిని అందుబాటులోకి ఉంచుతున్నారు.
బుకింగ్ ప్రక్రియ & ధరల వివరాలు.. 155313 నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోండి:
వాటర్ ట్యాంకర్ కావాలనుకునే వినియోగదారులు 155313 నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ధరల విషయానికొస్తే, 5 వేల లీటర్లకు తొలి 4 కిమీలకు రూ.400 (తర్వాత కిలోమీటర్‌కు రూ.55), 10 వేల లీటర్లకు రూ.800 (తర్వాత కిలోమీటర్‌కు రూ.65), అలాగే 20 వేల లీటర్లకు రూ.1600 (తర్వాత కిలోమీటర్‌కు రూ.80) గా ఛార్జీలను నిర్ణయించారు. తాగునీటిపై ఒత్తిడి తగ్గించేందుకు పౌరులంతా ఈ ప్రత్యామ్నాయ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
