రేపటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన కేసీఆర్… ఇక లోక్ సభ సంగతి తేల్చేందుకు పక్కాగా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రచార కదన రంగంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ.. రెండు సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేసిన ఆయన.. శుక్రవారం నుంచి మరో 13 సెగ్మెంట్లను చుట్టేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 29 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 11 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. టార్గెట్‌గా పెట్టుకున్న 16 లోక్‌సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా అధినేత కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. 29వ తేదీన నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం… సాయంత్రం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం మీటింగ్‌లో ప్రసంగిస్తారు. రెండు సభలతో మొదటి రోజు సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాలను కేసీఆర్ కవర్ చేస్తారు.
మార్చి 31న సాయంత్రం నాలుగు గంటలకు నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్‌లోని వనపర్తి సభలో కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్ బహిరంగ సభకు హాజరవుతారు. ఇక ఏప్రిల్ ఒకటిన.. సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని రామగుండం సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 2న సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్‌లో సాయంత్రం ఐదున్నర గంటలకు భువనగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం నాలుగు గంటలకు జహీరాబాద్, సాయంత్రం ఐదున్నర గంటలకు నర్సాపూర్‌లో సభకు హాజరవుతారు. ఏప్రిల్ 4న సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్, ఐదున్నర గంటలకు ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
మరోవైపు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సిరిసిల్లలో పర్యటిస్తూనే.. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టిపెట్టారు. గ్రేటర్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలపై కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.