బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీ, తెలంగాణలో వర్షాలు

  • Publish Date - September 3, 2019 / 03:07 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న నేడు, రేపు గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్ర తెలిపింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనున్నట్లు వెల్లడించింది. 

ఈ అల్పపీడనానికి అనుబంధంగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో సముద్ర మాట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

అల్పపీడనం, నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా మారడం వల్ల ఏపీలోని 75 శాతం ప్రాంతాల్లో మూడు రోజులపాటు విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య కోస్తా, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్లు, ఒకటి రెండు చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్లు వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించారు.

Also Read : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య