పంచాయతీ ఎన్నికలు : ఇవాళ్టి నుంచి రెండో విడత నామినేషన్లు

  • Publish Date - January 11, 2019 / 03:28 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 21, జనవరి 25, జనరవి 30వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ ప్రక్రియ పూర్తి ముగిసింది. జనవరి 11 వ తేదీ శుక్రవారం నుంచి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 4,137 పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 172 మండలాల్లో జరుగనున్న రెండో విడతలో 36,620 వార్డులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీ శుక్రవారం నుంచి 13వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ విడతకు 25వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు చివరిరోజున భారీగా నామినేషన్లు వేశారు. గురువారం వాటి పరిశీలన జరుగుతుంది. తొలి విడతలో 97,690 నామినేషన్లు వచ్చాయి. 4479 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వార్డులు 39,822 ఉన్నాయి. 320 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలే సర్పంచి అభ్యర్థులను ఖరారు చేశారు. మేజర్‌ పంచాయతీలు, ఆదాయ వనరులు ఉన్న పంచాయతీల్లో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగియడం, ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వారు సర్పంచి స్థానాలను ఆశించడంతో చాలాచోట్ల ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని చాలా పంచాయతీల్లో అభ్యర్థులను ఎమ్మెల్యేలే ఖరారు చేశారు. 

అత్యధిక పంచాయతీలను చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునివ్వడంతో అధికార పార్టీ మద్దతుతో బరిలో దిగే సర్పంచి అభ్యర్థులను ఖరారు చేయడం నుంచి వారిని గెలిపించుకోవడం వరకు పార్టీ దృష్టి సారించింది. తమ పార్టీకి చెందినవారు ఎక్కువమంది బరిలో నిలిచినచోట నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఒక్కరే పోటీలో నిలిచేలా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో వామపక్ష పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం అనర్హతకు గురైన వారు శుక్రవారం ఆర్డీవోకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 13వ తేదీన ఉపసంహరణ ఉంటుంది.