రంగురంగుల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏ ఇంట్లో చూసినా.. సకినాలు, గారెలు, అరిసల ఘమఘమలు వాడంతా వెదజల్లుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలు మిన్నంటాయి. లోగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి, వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అందంగా అలంకరించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నల సందడితో రాష్ట్రమంతటా పండగ వాతావరణం నెలకొంది. పండగ వేళ ప్రతి ఇంట్లోనూ గుమగులాడే పిండివంటలు నోరూరిస్తున్నాయి. అప్పాలు, సకినాలు, అరిసెలు, మురుకులు, లడ్డూలు, చెగోడీలు ఇలా అన్ని రకాల పిండివంటలు తయారు చేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు.
ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పల్లెల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడుతోంది. పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంగా పండగ జరుపుకుంటున్నారు. విజయవాడతో పాటు కోనసీమ, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
హైదరాబాద్ శిల్పారామం పల్లె వాతావరణాన్ని సంతరించుకుంది. శిల్పారామంలో కళాకారులు సందడి ఆకట్టుకుంటుంది. వివిధ కళారూపాలు ధరించి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. పిట్టలదొర మాటలు, జంగమయ్య కథలు సందర్శకులను అలరిస్తున్నాయి. విదేశీయులు సైతం శిల్పారామంకు విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్‌కు వేల సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులను ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.