Uttarakhand Rishi Ganga Power Project: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో ఉన్నదేంటంటే.. గ్రామానికి సమీపంలో 2005లో మొదలుపెట్టిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని అన్నారు. అలా రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామవాసుల నివసించే హక్కుకు, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉందని న్యాయస్థానానికి విన్నవించారు.
ఉత్తరాఖండ్ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్ తాగడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ హెచ్చరిక రెండింటికీ మధ్య సంబంధమేంటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడకపోవచ్చు.
ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్ ప్రాంతంలోని కేదార్‌నాథ్‌ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్‌నాథ్ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి.
2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చరించారు. కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచుకొండ చరియలు జోషిమట్ వద్ద అకాలంలో విరిగిపడటంతో వరదపొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. అలా రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది.
చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురైంది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్‌కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించేశాయి. ఇవి చాలదన్నట్లు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న తపోవన్ , పిపాల్ కోటి ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థ విష్ణుప్రయాగ్ ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి.
2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది.
2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్‌లోని స్నో అండ్ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది.