వేసుకున్న షర్టు విప్పితేనే విమానంలోకి రానిస్తామని లేకుంటే ఎక్కనిచ్చేది లేదని విమానసిబ్బంది ఓ బాలుడిని అడ్డుకున్నారు. దీంతో సదరు బాలుడు బిత్తరపోయాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..10 సంవత్సరాల బాలుడు స్టీవి లుకాస్ తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఎయిర్ పోర్టుకు వచ్చిన స్టీవీలుకాస్ ను ఎయిర్ పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. స్టీవి లుకాస్ ధరించిన టీషర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. షర్టు విప్పితేనే లోపలికి రానిస్తామని చెప్పారు. టీషర్ట్ మార్చుకోవాలని సూచించారు. ఎందుకంటే స్టీవి లుకాస్ వేసుకున్న టీషర్ట్‌పై కోబ్రా స్నేక్ బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూడటానికి భయపెట్టేలా ఉంది. అది నిజమైన కోబ్రా అన్నంత నాచ్యురల్ గా ఉంది. దీంతో..ప్రయాణీకులు భయపడతారనే ఉద్దేశంతో సిబ్బంది టీ షర్ట్ మార్చుకోవాలని సూచించారు.
తమ పిల్లాడిని అడ్డుకున్న ఎయిర్ పోర్ట్ సిబ్బందిపై స్టీవీ తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే అలాంటి టీషర్ట్‌తో లోపలికి వెళ్తే మిగతా ప్రయాణికులు భయపడే అవకాశం ఉందని..దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. స్టీవీ లుకాస్ టీషర్ట్ విప్పించి మరో టీషర్ట్ తొడిగించారు. అనంతరం సిబ్బంది విమానంలోకి అనుమతించారు.