Donald Trump : ఓటమి దెబ్బతో బుద్దొచ్చింది..! వలసలపై ట్రంప్ యూటర్న్..?
Donald Trump : అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా తన వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిపోర్టేషన్ విధానం మరీ కఠినంగా ఉందని అంగీకరిస్తూనే.. కొంతమంది వలసదారులకు అమెరికాలోనే ఉండే అవకాశం కల్పించే దిశగా సంకేతాలిచ్చారు.
Donald Trump
Donald Trump : మధ్యంతర ఎన్నికల్లో ఘోర ఓటమితో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బుద్దొచ్చినట్లు కనిపిస్తోంది. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే విషయంలో తన ప్రభుత్వం అనుసరించిన కఠిన వైఖరి మరీ ఎక్కువైందని స్వయంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. కొంతమంది విషయంలో తమ ప్రభుత్వం అతిగా వ్యవహరించిందని అంగీకరించారు. వలసదారులపై కఠిన చర్యలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా లాభంతో పాటు నష్టాన్ని కూడా కలిగించాయని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read : Gold Silver Prices Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ అప్డేట్.. ధరల్లో కీలక మార్పులు.. నేటి రేట్లు ఇవే..
అమెరికా ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని మాట్లాడారు. అక్రమ వలసదారులపై చేపట్టిన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అవును.. తన విధానం చాలా కఠినంగా ఉందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. సరిహద్దులను మూసివేయడం, నేరాలకు పాల్పడిన వారిని దేశం నుంచి పంపించడం వంటి చర్యలకు మంచి మార్కులు వచ్చాయని చెప్పారు. అయితే, అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న కొంతమంది వలసదారులు కూడా ఈ చర్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రంప్ అంగీకరించారు.
అమెరికాలో పదేళ్లు, పదిహేనేళ్లుగా నివసిస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పన్నులు చెల్లిస్తున్నవారి విషయంలో కొంత వెసులుబాటు కల్పించే అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఇలాంటి వారిని దేశం నుంచి పంపించకుండా ఉండేందుకు డెమోక్రాట్లతో కలిసి ఒక ఒప్పందానికి రావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని మాత్రం దేశం నుంచి బహిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. డెమోక్రాట్లతో కలిసి వలస విధానంపై చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సెనేట్, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధించారు. దీంతో డోనల్డ్ ట్రంప్ మిగిలిన అధ్యక్ష పదవీకాలంలో కాంగ్రెస్‌పై డెమొక్రటిక్ పార్టీ నియంత్రణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా హిస్పానిక్ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రిపబ్లికన్లకు మద్దతు తగ్గింది. వలసదారులపై కఠిన చర్యలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి.
