ElNino Effect : వామ్మో ఎల్‌నినో ఎఫెక్ట్.. అక్కడ పిట్టల్లా రాలుతున్న జనం.. 50వేల మందికిపైగా మృతి

ElNino Effect In Europe : శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండంపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

El Niño Effect in Europe

ElNino Effect In Europe : ఎల్‌నినో.. ప్రస్తుతం ఈ పేరు వింటే ప్ర‌తీ ఒక్కరి గుండెల్లో దడ వచ్చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ ఎల్‌నినో.. భారత దేశంపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైనా ఈ దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేసవి కాలం రావడానికి మరో ఐదు నెలలు ఉండగానే ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రభుత్వంసైతం ఎల్ నినో పట్ల అప్రమత్తమైంది. రబీలో ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక.. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ.. ఎల్ నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇలాంటి సమయంలో మరింత ఆందోళనకు గురిచేసే విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : Shamonda Virus : ప్రపంచానికి భయపెడుతున్న మరో కొత్త వైరస్.. తొలిసారి మనుషులకు సోకడంతో వైద్య రంగం షాక్! కొత్త ముప్పు పొంచి ఉందా?

శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండంపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో వడదెబ్బ కారణంగా సుమారు 50వేల మందికిపైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. శిలాజ ఇంధన కాలుష్యం వల్ల కలిగే వాతావరణ మార్పుల కారణంగానే వీరిలో 32,600 మంది మరణించినట్లు తెలిపారు. అయితే, మొత్తం మృతుల్లో 65శాతం మందికిపైగా వృద్ధులేనట. బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ లలోనూ రికార్డు స్థాయి ఉస్ణోగ్రతలు నమోదయ్యాయి.

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే ఐరోపా ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. అయితే, ఈసారి ఐరోపా చవిచూస్తోన్న వడగాల్పులు అతి దారుణమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిలు జారీ చేశారు. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదులుతున్న వేడి గాలి, ఎల్‌నినో ఎఫెక్ట్‌ వల్లే ఐరోపాలో ఈ హీట్‌డోమ్‌ పరిస్థితులు తలెత్తాయని వెల్లడించారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో ఎల్ నినో విజృంభణ చూస్తుంటే రానున్న వేసవి కాలంలో భారత దేశంలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతోంది. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎల్ నినో కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే ఎల్‌నినో‌పై.. దానిముప్పు నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వం ఆమేరకు చర్యలు ప్రారంభించాయి.