చనిపోయిన కూతురితో 8 నిమిషాలు గడిపిన తల్లి

కలలో మాత్రమే జరిగే ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించారు ఓ టీవీ ఛానెల్. 2016లో అకాల మరణం చెందిన ఏడేళ్ల కూతుర్ని కలుసుకుందీ ఆ తల్లి. చిన్నారి ఆడుకుంటుండగా అడుగు దూరంలో ఆమెతో కలిసి తిరిగింది. అంతేకాదు తల్లి జాంగ్ జి సంగ్ కూతురు నయీన్‌కు మధ్య సంభాషణ కూడా జరిగింది. గుండెల్లోంచి వస్తున్న బాధ కన్నీరులా జారిపోతుంటే అది చూస్తున్న వాళ్లంతా ఆ ఇద్దరి మధ్య మమేకమైపోయారు. 

వివరాల్లోకి వెళితే.. ఓ కొరియన్‌ టీవీ ‘మీటింగ్‌ యూ’ అనే షోలో జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి 2016లో మరణించిన కూతురు నయీన్‌ను చూడటమే కాదు. ఆమెతో కలుసుకొని మాట్లాడే వీలు కల్పించింది ఆ చిన్నారి. ఆడుకునే మైదానంలోకి తల్లిని తీసుకెళ్లింది. చెక్కల చాటున దాక్కొని అప్పుడే అమ్మా అంటూ ఏడేళ్ల పాప ముందుకు రావడం. ‘ఓ మై ప్రెటీ ఐ మిస్డ్‌ యూ’ అంటూ ఆ తల్లి పాప ముఖాన్ని ముట్టుకొని స్పర్శించే ప్రయత్నం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది. 

ఊదా రంగు గౌను, నల్లటి జుట్టుతో మెరుస్తున్న కళ్లు ఆ తల్లిని చూస్తూ ‘ఎక్కడికి వెళ్లావ్‌ ఇంతకాలం. నేను గుర్తున్నానా?’ అంటూ అమాయకంగా ప్రశ్నించింది. ‘నిన్ను ఎలా మరచిపోతాను అంటూ ఆ తల్లి బదులివ్వగా.. ‘అమ్మా ఐ మిస్ యూ’ ,‘నేను కూడా మిస్ అవుతున్నాను’ అంటూ తల్లీ కూతుళ్ల పరస్పరం చెప్పుకోవడం తల్లికే కాదు, వారిని చూస్తున్న ప్రేక్షకులు, పాప తండ్రి, సోదరుడు, సోదరీలను కంటతడి పెట్టించాయి. 

పాప ఓ పువ్వు పట్టుకొని తల్లి దగ్గరకు పరుగెత్తుకు రావడం. ‘అమ్మా! ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను’ అని హామీ ఇవ్వడం అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ఆ పాప టుంగుటూయల పరుపెక్కి ఏదో చదివి తల్లికి వినిపించడం, అలసిపోయానమ్మా, ఇక పడుకుంటానంటూ చెప్పడం, అందుకు పాపకు బాయ్‌ చెప్పడంతో ఆ తల్లి, ప్రేక్షకులు ఈ లోకం లోకి వస్తారు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ‘వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)’ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి తన కూతురుని కలసుకునే అవకాశాన్ని కొరియన్‌ టీవీ కల్పించింది. 

‘మున్వా బ్రాడ్‌ క్యాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎంబీసీ)’ నయీన్‌ డిజిటల్‌ క్యారెక్టర్‌ను సృష్టించేందుకు ఎంతో శ్రమించింది. డిజిటల్‌ కెమెరా ముఖానికి, డిజిటల్‌ గ్లౌవ్స్‌ను కప్పడం ద్వారా నిజంగా తన కూతురిని కలుసుకున్న అనుభూతిని పొందినట్లు తెలిపారు. ఎప్పటికీ మరచిపోని తన కూతురి ముఖాన్ని టీవీ షో ద్వారా చూసిన వారెవరు కూడా మరచిపోరని తన బ్లాక్‌లో రాసుకున్నారు జాంగ్.