చైనాలో కరోనా పుట్టిన నగరానికి భారత్ నుంచి విమానం

  • Publish Date - October 30, 2020 / 06:34 AM IST

దేశంలో కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మరణాలు.. కోట్లలో బాధితులు ఉన్నారు. ఇప్పటికీ కోట్ల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహన్ ఇప్పుడు పూర్తిగా వైరస్ నుంచి కోలుకుంది. చైనాలోని వూహన్ సిటీలో కరోనా వైరస్ కేసు మొట్టమొదటి సారి నమోదు కాగా.. అక్కడే ల్యాబ్‌లో పుట్టిందని, చైనా వాళ్లే పుట్టించారని రకరకాల అనుమానాలు ఉన్నాయి.



ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన మొదటి విమానాన్ని వందే భారత్ మిషన్ కింద చైనా నగరమైన వుహాన్కు ఈ రోజు(30 అక్టోబర్ 2020) పంపనుంది. చైనాలోని వూహాన్ నగరంలో డిసెంబరులో కరోనా వైరస్ మొదటి కేసు నమోదవగా.. జూన్‌లో వుహాన్ అధికారికంగా కరోనా వైరస్ రహిత నగరంగా ప్రకటించబడింది. అంతేకాదు.. రాష్ట్రంలో ఆంక్షలు కూడా తొలగించబడ్డాయి.



ఈ క్రమంలో రెండు దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తమ గమ్యస్థానాలకు తిరిగి తీసుకుని రావడానికి ఎయిరిండియా చైనాకు విమానంలో పంపుతుంది. ఢిల్లీ-గువాంగ్‌జౌ మధ్య అక్టోబర్ 23వ తేదీన విమానాన్ని రద్దు చేసిన తరువాత ఢిల్లీ-వూహాన్ విమానాన్ని ప్రకటించారు. అయితే ఢిల్లీకి వచ్చే ప్రజలు ఒంటరిగా 14 రోజులు హోటళ్లలో ఉండాల్సిన అవసరం ఉంది.



బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం పత్రికా ప్రకటన ప్రకారం.. “అక్టోబర్ 23వ తేదీన ప్రయాణించాల్సిన వందే భారత్ మిషన్ విమానాన్ని అక్టోబర్ 30కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ విమానం ఢిల్లీ-వూహాన్ మధ్య నడపబడుతుంది”.



కరోనా మహమ్మారి నేపథ్యంలో, మే 7వ తేదీన వందే భారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి రెండు మిలియన్ల మంది భారతీయులు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మిషన్ ఏడవ దశలో, ఈ నెల చివరి నాటికి 24 దేశాల నుండి 1057 అంతర్జాతీయ విమానాలు నడపబడ్డాయి. దీని కింద 1.95 లక్షల మంది వస్తారని అంచనా. అక్టోబర్ 29 నాటికి, వందే భారత్ మిషన్ కింద, 20.55 లక్షల మంది భారతీయులు ఎయిర్ ఇండియా, ప్రైవేట్ మరియు విదేశీ విమానయాన సంస్థలు, చార్టర్డ్ విమానాలు, నావికా నౌకలు మొదలైన వాటి ద్వారా తిరిగి వచ్చారు.