Pope Leo : పోప్ లియో సంచలన వ్యాఖ్యలు.. ‘యుద్ధ రక్తంతో నిండిన చేతులు ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే’

Pope Leo : అమెరికా, ఇరాన్ యుద్ధంపై పోప్ లియో సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దం చేసే నాయకుల ప్రార్థనలు దేవుడు వినడన్నారు.

Pope Leo said on palm sunday God rejects prayers of leaders who wage wars

Pope Leo : అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై పోప్ లియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తంతో నిండిన చేతులు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడంటూ వ్యాఖ్యానించారు. ఈస్టర్ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా జరిగిన పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న పోప్.. యుద్ధానికి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించారు. యుద్ధాలు ప్రారంభించే నాయకుల ప్రార్థనలను దేవుడు తిరస్కరిస్తాడని.. వారి చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయని.. వారు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడని ప్రకటించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో పోప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణను భయంకరమైనదిగా వర్ణించిన పోప్.. శాంతికి మారుపేరైన ఏసుక్రీస్తు యుద్ధాన్ని తిరస్కరిస్తాడని.. ఆయన పేరుతో యుద్ధాలను సమర్థించుకోవడం సరికాదన్నారు. అమెరికాకు చెందిన మొదటి పోప్ అయిన లియో ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో ఏ నాయకుడి పేరును కూడా నేరుగా ప్రస్తావించలేదు. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో యుద్ధం చేస్తున్న దేశాధ్యక్షులను ఉద్దేశించేనని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉన్న క్రైస్తవులు ఈ భయంకర ఘర్షణ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని, వారు ఈస్టర్ పండుగను కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ జరపాలని ఆయన పలుమార్లు పిలుపునిచ్చారు. తన ప్రసంగంలో పోప్ లియో, యేసు అరెస్టు చేయబడే ముందు జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో ఆయన అనుచరుల్లో ఒకరు కత్తితో దాడి చేయగా, యేసు అతన్ని నిలదీశారని చెప్పారు. యేసు ఎన్నడూ ఆయుధాలు ధరించలేదు.. తనకు హాని కలుగుతుందని తెలిసినా తనను తాను రక్షించుకోలేదు.. యుద్ధం చేయలేదు. ఆయన హింసను తిరస్కరించే దేవుడి రూపాన్ని చూపాడు. చివరి గడియల్లో సైతం ఆయన తనను తాను రక్షించుకోవడానికి బదులుగా సిలువ వేయబడటాన్ని అంగీకరించారని చెప్పుకొచ్చారు.