పాకిస్థాన్ సాహస యువతి..నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ని తుపాకీతో కాల్చిన తాలిబన్ ఉగ్రవాది ఎహ్సానుల్లా ఇషాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 6,2020) ఓ ఆడియో ద్వారా వెల్లడించాడు. తాజాగా రిలీజైన ఆడియో క్లిప్‌లో.. తాను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నట్లు ఉగ్రవాది ఇషాన్ చెప్పాడు. జనవరి 11న పోలీసుల అదుపులోనుంచి బైటపడినట్లు అతను తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్ గా మారింది.
2017లో పోలీసులు ఎహ్సానుల్లా ఇషాన్ అరెస్టు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన మాట తప్పారనీ..తన డిమాండ్స్ ను నెవేర్చలేదన్నాడు. జైలులో ఉండగా చట్టాన్ని అనుసరించాననీ..కానీ పాక్ ప్రభుత్వం తన నిజాయితీని గుర్తించలేదనీ..నన్ను నా కుటుంబాన్ని పాక్ ప్రభుత్వం మోసం చేసిందని ఆడియోలో తెలిపాడు. తనకు, పాకిస్తాన్ అధికారులకు మధ్య ఒక ఒప్పందం జరిగిందనీ..దాని ప్రకారం, టివి న్యూస్ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వమని బలవంతం చేశానని..అయితే వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేని ఎహ్సానుల్లా ఇషాన్ తెలిపాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ వాయిస్ పరిశీలించి ఇస్లామాబాద్ వర్గాలు ఆ వాయిస్ ఎహ్సానుల్లా ఇషాన్ దేనని ధృవీకరించాయి.
2012లో పాక్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హక్కుల గురించి ప్రచారం చేస్తున్న సమయంలో మలాలా యూసఫ్ జాయ్ పై ఉగ్రవాది ఇషాన్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో మలాలా తలలోకి బుల్లెట్ దిగింది. కాగా..2014లో పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడికి కూడా ఇషానుల్లా ఇషాన్ బాధ్యుడు. ఈ దాడిలో 134 మంది స్కూల్ పిల్లలు, 15 మంది సిబ్బంది మరణించారు.
పాక్ లో బాలికల విద్యాహక్కుపై మలాలా పోరాటం చేసింది. ఉగ్రవాదుల అరాచాకాలపై గళమెత్తింది. పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. దీన్ని తెహ్రీక్ ఈ తాలిబన్ తీవ్రవాద సంస్థ వ్యతిరేకించింది. మలాలా ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే కాల్చి పారేస్తామని బెదరించింది. కానీ మలాలా తన పట్టువీడలేదు. బాలిక విద్యాహక్కుల గురించి ప్రచారం కొనసాగించింది. దీంతో ఉగ్రవాదులు మలాలాపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మలాలా తలలో బుల్లెట్ దిగింది. తరువాత సుదీర్ఘ కాలంపాటు చికిత్స తీసుకుంది. మలాలా కోలుకుంది. కానీ మలాలాను హతం చేసి తీరుతామని తాలిబన్లు మరోసారి హెచ్చరించారు అయినా మలాలా ఏమాత్రం భయపడలేదు.
మలాలా బాలికల విద్యాహక్కు కోసం చేసిన పోరాటం..తాలిబన్లకు కూడా భయపడకుండా ఆమె చేసిన పోరాటానికి నోబెల్ శాంతి బహుమతిని పొందింది. మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర ‘‘ఐయామ్ మలాలా’’పేరుతో పుస్తకం కూడా వచ్చింది. మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది.