భారత్ దెబ్బతో వణికిపోయిన జైష్-ఎ-మొహమ్మద్… ఇప్పుడు ఆ ముసుగులో డిజిటల్ దందా!
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

JeM Chief Masood Azhar
Masood Azhar: భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టింది. పాక్ వ్యాప్తంగా 300కి పైగా మసీదులు కడుతున్నామనే పేరుతో రూ.391 కోట్ల నిధులు సేకరించే యత్నంలో ఉంది. ఈ డిజిటల్ దందాకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఇస్తోందని భారత భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ ప్రభావం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం.. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో జైష్ ప్రధాన కార్యాలయం ‘మార్కాజ్ సుభానల్లా’ సహా ఐదు కీలక శిక్షణా శిబిరాలు ధ్వంసమయ్యాయి. దీంతో జైష్ ఉగ్ర వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
మసీదుల ముసుగులో విరాళాల సేకరణ
పాకిస్థాన్ ప్రభుత్వం ఆయా స్థావరాలను పునర్నిర్మిస్తామని చెప్పినా జైష్ మాత్రం తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టర్లు, వీడియోలు, మసూద్ అజహర్ లేఖలను చాలా మంది షేర్ చేస్తున్నారు.
డిజిటల్ వాలెట్లు: బ్యాంకు ఖాతాలకు బదులుగా EasyPaisa, Sadapay వంటి వాలెట్లు వాడుతున్నారు. ఇవి అన్నీ మసూద్ అజహర్ (Masood Azhar)కుటుంబం నియంత్రణలో ఉన్నాయి.
ఆడియో సందేశాలు: మసూద్ సోదరుడు తల్హా అల్ సైఫ్… ప్రతి ఒక్కరూ రూ.21,000 విరాళం ఇవ్వాలని ఆడియోలో కోరుతున్నాడు.
ఈ ప్లాన్ వెనుక ఉద్దేశాలు
అధికారుల విశ్లేషణ ప్రకారం మసీదుల నిర్మాణం కేవలం ముసుగు మాత్రమే. అసలు లక్ష్యాలు రెండు..
స్థావరాల విస్తరణ: భవిష్యత్తులో భారత్ దాడులు జరిగినా ఒకేసారి నష్టం జరగకుండా దేశవ్యాప్తంగా చిన్న కేంద్రాలుగా విస్తరించడం.
సురక్షిత ఆశ్రయాలు: మసూద్ అజహర్ కుటుంబానికి పెద్ద కేంద్రాలు కట్టి దాగిపోవడం, దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం బాధ్యత తప్పించుకోవడం.
మిగిలిన డబ్బుతో ఆయుధాలు!
ఒక్కో మసీదు నిర్మాణానికి రూ.1.25 కోట్లు అవసరమని జైష్ చెబుతున్నా, వాస్తవానికి ఒక్క దానికి రూ.40-50 లక్షలే చాలు. అంటే 313 కేంద్రాలకూ రూ.123 కోట్లు మించదు. మిగిలిన నిధులను ఆయుధాలు కొనడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడాలని జైష్ ప్లాన్ చేస్తోంది.
అంతర్జాతీయ భయాలు
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.