ధర్మస్థల కేసులో సంచలనం.. ఫిర్యాదుదారుడి అరెస్ట్.. అతడి మాటలు నమ్మి చెప్పిన చోటల్లా తవ్విన పోలీసులు.. చివరికి..
సిట్ చీఫ్ ప్రణబ్ మోహంతీ ఆ ఫిర్యాదుదారుని ప్రశ్నించారు. అతని పేరును ఇంకా వెల్లడించలేదు. అధికారిక వర్గాల ప్రకారం, అతను చెప్పిన మాటలు, అధికారిక పత్రాలలో ఎక్కడా పొంతన లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.

Dharmasthala
Dharmasthala: ధర్మస్థల కేసులో సంచలనం చోటుచేసుకుంది. కర్ణాటక ధర్మస్థలలో గతంలో పనిచేసిన శానిటేషన్ వర్కర్, అనేక మంది మృతదేహాలను తాను బలవంతంగా పూడ్చివేశానని ఆరోపించిన వ్యక్తిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్ట్ చేసింది. అతడు ప్రస్తుతం 10 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
వందల మంది అమ్మాయిల శవాలను పూడ్చి పెట్టానని అతడు చెప్పిన విషయం తెలిసిందే. అతడి మాటలను నమ్మి అతను చెప్పిన చోటల్లా పోలీసులు తవ్వకాలు జరిపారు. ఏమీ దొరక్కపోవడంతో, అతడు అంతా అబద్ధం చెప్పినట్టు పోలీసులు భావిస్తున్నారు.
అతడి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఆ విషయం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. (Dharmasthala)
సిట్ చీఫ్ ప్రణబ్ మోహంతీ ఆ ఫిర్యాదుదారుని ప్రశ్నించారు. అతని పేరును ఇంకా వెల్లడించలేదు. అధికారిక వర్గాల ప్రకారం, అతను చెప్పిన మాటలు, అధికారిక పత్రాలలో ఎక్కడా పొంతన లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.
Also Read: భారత్ దెబ్బతో వణికిపోయిన జైష్-ఎ-మొహమ్మద్… ఇప్పుడు ఆ ముసుగులో డిజిటల్ దందా!
ఫిర్యాదుదారుడిని గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిట్ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ధర్మస్థలలో తన కుమార్తె మిస్ అయిందని చెప్పిన ఓ మహిళ కూడా ప్లేట్ ఫిరాయించింది. అసలు తనకు కూతురే లేదని చెప్పింది. తమ తాతల ఆస్తిని ఆలయ ట్రస్ట్ బలవంతంగా తీసుకోవడంతో ప్రతీకారం కోసం అలా చెప్పానని ఆ మహిళ ఓ చానల్ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
మంత్రి ఏమన్నారు?
ధర్మస్థల కేసు గురించి హోం మంత్రి జీ పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ… “ఫిర్యాదుదారుడిని సిట్ అరెస్టు చేసింది, అతడు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మరిన్ని వివరాలు చెప్పలేం.
సిట్ తుది నివేదిక ఇస్తేనే వివరాలు వెల్లడిస్తాం. అతడిని ఎందుకు అరెస్టు చేశారో, ఉద్దేశం ఏమిటో సిట్ మాత్రమే చెప్పగలదు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మేము దర్యాప్తు ప్రారంభించాము” అని అన్నారు.
ధర్మస్థలపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందిస్తూ.. “చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కానీ వారి కామెంట్ల ఆధారంగా మేము నిర్ణయం తీసుకోలేం” అని అన్నారు.
అసలు మొదట ఏం జరిగింది?
ధర్మస్థలలో 1995 నుండి 2014 వరకు పని చేసిన శానిటేషన్ వర్కర్ అనేక మంది మృతదేహాలను తాను బలవంతంగా పూడ్చివేశానని, ఈ విషయాన్ని ఇంకా దాచిపెట్టలేనంటూ ఫిర్యాదు చేశాడు.
పోలీసులు జూలై 4న భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేశారు. తాను నిందితులను గుర్తించగలనని, పాతిపెట్టిన ప్రదేశాలను చూపిస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి రక్షణ కావాలని కూడా కోరారు.
ఆ ఆరోపణలు ధర్మస్థలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఎందుకంటే ఆ పట్టణం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. సిట్ ఈ నెల ప్రారంభంలో నేత్రావతి నది పక్కన అడవి ప్రాంతం నుంచి 15 ఎముకలను (మానవ ఎముకలుగా అనుమానిస్తున్నారు) వెలికి తీసింది.
ఆ అవశేషాలు ఒక పురుషునివని భావిస్తున్నారు. మొత్తం 13 ప్రదేశాల్లోని 6వ ప్రదేశం నుంచి తవ్వకాల్లో అవి బయటపడ్డాయి.
ఓ ఫోరెన్సిక్ నిపుణుడు అవి మగవారి ఎముకలు కావచ్చని ప్రాథమిక అభిప్రాయం చెప్పినా పూర్తి పరిశీలన తర్వాతే నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు.
“ఫోరెన్సిక్ వైద్యులు, సీన్ ఆఫ్ క్రైమ్ అధికారులు ప్రదేశం వివరాలు, అవశేషాల పరిస్థితి నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు” అని సిట్ అధికారి తెలిపారు.
ఈ వెలికితీత సిట్ తవ్వకాలు ప్రారంభించిన రెండో రోజే జరిగింది. మొదటి ప్రదేశం నుంచి పాన్ కార్డు, డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.
ఆ పాన్ కార్డు బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల వ్యక్తి సురేశ్‌కి సంబంధించినదని గుర్తించారు. అతడు ఈ ఏడాది ప్రారంభంలో జాండిస్‌తో చనిపోయాడు. ఆ గ్రామంలోనే అతడి దహన క్రియలు జరిగాయి. “అతడు గతంలో ధర్మస్థలకి వచ్చినప్పుడు ఆ కార్డు పోగొట్టుకుని ఉండవచ్చు” అని అధికారి తెలిపారు. ఫిర్యాదుదారుడు చెబుతున్న విషయాలని, బయటకు వస్తున్న వాస్తవాలకు పొంతన లేకపోవడంతో అతడిని విచారిస్తున్నారు.