Tailor Bird :సూది,దారంతో గూడు కట్టుకుంటున్న బుల్లిపిట్ట..
సూది,దారంతో గూడు కట్టుకుంటున్న బుల్లిపిట్ట.. ఏదో పేద్ద టైలర్ లాగా సూదీ దారంతో భలే కట్టేస్తోంది గూడు. ఎవరు నేర్పించారు ఈ బుల్లి పిట్టకు ఇన్ని తెలివితేటలు...
Tailor Bird Nesting
The Tailor bird nesting process is amazing : ఎన్నో అద్భుతాలు సృష్టించే మనిషికి ప్రకృతి ఎప్పుడు ఓ అత్యద్భుతంగా కనిపిస్తుంది. చెట్లు, పుట్టలు,పక్షులు ఇలా అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి. ఎన్నో రహస్యాలను ఛేధించే మనిషికి ఈ ప్రకృతిలో ఉండే మరెన్నో రహస్యాలు సవాలు విసురుతునే ఉంటాయి. మనిషి ఎన్నో తరాలు..దశాబ్దాలు,శతాబ్దాలపాటు శోధించి సాధించిన విజ్ఞానం ఓ చిట్టి పక్షుల ముందు బలాదూర్ అనిపిస్తుంది.పక్షులు సంతానాన్ని అభివృద్ధి కోసం వలసలు వెళ్లే విధానం..అవి గూడు కట్టుకునే పద్ధతి..గూడు కట్టుకోవటానికి అవి అత్యంత సునాయాసంగా చేసే పనులు భలే వింతగా..ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఉదాహరణకు పిచ్చుకలు గూడు కట్టే పద్ధతి పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా సాధ్యం కాదనిపిస్తుంది. ఎంత గాలి తుఫాను వచ్చినా పిచ్చుక గూడు ఏమాత్రం చెక్కు చెదరదు. అంత పటిష్టంగా కట్టుడుతుంది పిచ్చుక గూడు. చెట్టునుంచి గూడు గాలికి ఊడిపుతుందేమో గానీ గూడు నుంచి ఒక్కటంటే ఒక్క పుల్లగానీ ఊడి పడనే పడదు. అది పిచ్చుక గూడు ప్రత్యేకత. మరి వాటికి ఎవరు నేర్పించారు అంతటి నేర్పరితనం అంటే ప్రకృతే అని చెప్పకతప్పదు.

అలాగే ఈ ప్రకృతిలో ఉండే ఎన్నో రకాల పక్షులు గూడు కట్టే విధానం ఒక్కో పక్షిది ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అటువంటి క్రేజీ బర్డ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..అదే ‘టైలర్ బర్డ్’. ఈ టైలర్ బర్డ్ గూడు కట్టుకోవటం చూస్తే వావ్..అని కచ్చితంగా అనిపిస్తుంది. ఏదో పెద్ద పెద్ద టైలర్లు బట్టలు కుట్టినట్లుగా గూడు కట్టుకుంటుందీ పక్షి. చెట్ల కొమ్మలకు ఉండే ఆకుల్ని కలిపి కుట్టేస్తుంది. ఏంటీ ఆకుల్ని కుట్టటానికి దానికి సూదీ దారం ఎవరిచ్చారు? ఎక్కడనుంచి తెచ్చుకుంది?అంటారా?

అదే మరి ప్రకృతి వింత అంటే టైలర్ పక్షి ముక్కునే సూదిగా..దూదినే దారంగా చేసుకుని ఆకుల్ని కలిపి కుట్టేసి గూడుగా తయారు చేసుకుంటోందీ బుల్లిపిట్ట. గూడు కట్టుకోవడంలో టైలర్ బర్డ్ ప్రత్యేకతే వేరు అనిపిస్తుందీ వీడియో చూస్తే. పిచ్చుక సైజులో ఉండే ఈ బుల్లి పిట్ట… ఆకులనే ఇల్లులా కట్టుకుంటుది. దీని కోసం అది తన ముక్కును సూదిలా చేస్తుంది. ఆకుల చివర్లకు కన్నాలు పెట్టి… ఆ కన్నాల లోంచీ… దూదిని దారంలా సన్నగా చేసి లాగుతుంది… అలా 3 లేదా 4 రోజుల్లో గూడు కట్టుకుంటుంది.

గూడు రెడీ అయ్యాక… అందులో దూది, మెత్తగా ఉండే పీచులాంటివి సేకరించి మెత్తటి పరుపులా తయారు చేస్తుంది గూడు లోపల. ఆ తరువా దానిపై గుడ్లు పెడుతుంది. అసలు ఈ బర్డ్ ఇలా నెస్ట్ ఎలా కట్టుకుంటుంది? దూదిని దారంగా చెయ్యవచ్చు అని దీనికి ఎవరు చెప్పారు.. దీనికి అన్ని తెలివితేటలు ఎవరిచ్చారు? అంటే కచ్చితంగా ప్రకృతే అని చెప్పాలి. ఆ ప్రకృతే సమస్త ప్రాణికోటికి జీవించటం ఎలాగో నేర్పిస్తుంది. సంతానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నేర్పిస్తుంది. ఆయా ప్రదేశాల వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాణులు వాటి సంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి ఈ సమస్త సృష్టిలో. దాంట్లో భాగమే ఈ టైలర్ బర్డ్ గూడు కట్టుకునే పద్ధతి. ఇటువంటి ఎన్నో జ్ఞానాలకు…విజ్ఞానాలకు నెలవు ఈ అత్యద్భుతమైన ప్రకృతి. మరి టైలర్ బర్డ్ తెలివితేటల్ని మీరు కూడా చూడండీ కచ్చితంగా వావ్ అంటారు..
