Mona Lisa Pink Diamond : గోల్కొండ టు జెనీవా వేలం వరకు.. రూ.130 కోట్లకు అమ్ముడైన 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్..
Mona Lisa Pink Diamond : భారత గోల్కొండ గనుల్లో పుట్టిన 24 క్యారెట్ల బల్గారీ పింక్ డైమండ్ జెనీవా వేలంలో భారీ ధర పలికింది. మోనాలిసా ఆఫ్ డైమండ్స్‌గా పేరొందిన ఈ అరుదైన వజ్రం ప్రత్యేకతలు, చరిత్ర వివరాలివే..
Mona Lisa Pink Diamond
- 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
- 70 ఏళ్లుగా ఒకే కుటుంబం దగ్గర.. ఇప్పుడు కోట్ల వర్షం
- మోనాలిసా ఆఫ్ డైమండ్స్.. 24 క్యారెట్ల పింక్ డైమండ్ ప్రత్యేకతలివే
Mona Lisa Pink Diamond : ప్రపంచంలో వజ్రాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ అరుదైన రంగు, అద్భుతమైన నాణ్యత ఉన్న వజ్రాలంటే కలెక్షనర్లు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు. తాజాగా అలాంటి ఓ గులాబీ వజ్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
దీని ధర ఏకంగా 14.6 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.130 కోట్లు అనమాట.. అదే ‘బల్గారి పింక్’ (Bulgari Pink) వజ్రం.. దీన్ని గులాబీ వజ్రాల రాణిగా పిలుస్తారు.. 24 క్యారెట్ల బల్గారి పింక్ డైమండ్ గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గోల్కొండ గనుల నుంచి జెనీవా వరకు.. :
24 క్యారెట్ల బరువున్న ఈ అరుదైన పింక్ డైమండ్ జెనీవాలో జరిగిన క్రిస్టీస్ వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. గులాబీ వజ్రాల మోనాలిసాగా పేరొందిన ఈ రాయి, ఏకంగా 70 ఏళ్లకు పైగా ఒకే ప్రైవేట్ కుటుంబం దగ్గర ఉండటం విశేషం. 1950వ దశకంలో భారత్ లోని ప్రసిద్ధ గోల్కొండ గనుల నుంచి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశారు. కోహినూర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలకు కూడా గోల్కొండ గనులే పుట్టినిల్లు కావడం విశేషం..
Read Also : CM Revanth Reddy : భారత్ సమిట్‌పై విపక్షాల విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్!
ఆ తర్వాత ఈ వజ్రాన్ని రోమ్‌లోని బల్గారి సంస్థకు తీసుకెళ్లి అందమైన ఆభరణంగా తీర్చిదిద్దారు. దీని ఎమరాల్డ్ కట్, ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్ రంగు, (VVS2) స్పష్టతతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యంత అరుదైన టైప్-IIa వజ్రాల కోవకు చెందుతుంది. ఇందులో నైట్రోజన్ ఖాళీ కేంద్రాల వల్లే గులాబీ రంగు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్రిస్టీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ మాక్స్ ఫాసెట్ ఈ వజ్రాన్ని ‘పింక్ డైమండ్ల మోనాలిసా’గా అభివర్ణించారు. దీని ధర 10 నుంచి 15 మిలియన్ స్విస్ ఫ్రాంకుల మధ్య పలుకుతుందని అంచనా వేయగా, చివరకు 12.1 మిలియన్ ఫ్రాంకులు (14.6 మిలియన్ డాలర్లు) దక్కాయి.
బోట్స్వానాలో మరో అద్భుతం :
ఇదిలా ఉంటే.. బోట్స్వానాలోని కరోవే గనిలో 37.4 క్యారెట్ల మరో అరుదైన పింక్ డైమండ్ బయటపడింది. ఇందులో సగం గులాబీ రంగు, మరో సగం రంగులేని భాగంగా ఉండటం విశేషం. ఇది భవిష్యత్తులో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటిగా నిలవొచ్చని నిపుణులు భావిస్తున్నారు..
మరోవైపు ప్రయోగశాలల్లోనూ వజ్రాలను తయారు చేస్తున్నారు. చిన్న వజ్రపు సీడ్‌పై కార్బన్ అణువులను పొరలుగా పేరుకునేలా చేసి సహజ వజ్రాల స్ఫటిక నిర్మాణాన్ని పోలిన రాళ్లను తయారు చేస్తున్నారు. ఇలా సహజంగా ఏర్పడే వజ్రాల నుంచి ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాల వరకు.. ప్రపంచ రత్నాల మార్కెట్లో కొత్త కొత్త విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి..
