Techie Dog Walking : పార్ట్ టైం జాబ్.. నెలకు రూ. 6లక్షలు.. కేవలం కుక్కలను వాకింగ్ కి తీసుకెళ్తే చాలు.. ఎక్కడంటే..!
Techie Dog Walking : సైడ్ బిజినెస్ గా కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్తూ.. నెలకు రూ. 6లక్షలు సంపాదిస్తున్నాడో టెకీ.
new york software engineer earns rs 600000 per month by doing dog walking as part time job
Techie Dog Walking : టైటిల్ చదివితేనే టెంప్టింగ్గా ఉంది కదా.. ఎక్కడో చెప్పండి వెళ్లిపోతామని రెడీ అవుతున్నారా.. కాస్త ఆగండి.. ఎందుకంటే కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తూ నెలకు రూ.6 లక్షలు సంపాదించే ఈ పార్ట్ టైమ్ జాబ్ మన దగ్గర కాదు.. అమెరికాలో! అక్కడ ఇప్పటికే ఓ యువకుడు ఇలా పార్ట్ టైమ్‌గా కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తూ నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న న్యూయార్క్ నగరానికి చెందిన కోబీ గుడ్‌హార్ట్ అనే యువకుడు ఈ వినూత్న బిజినెస్‌ను ప్రారంభించాడు. తనకు ఖాళీ ఉన్న సమయాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తూ.. నెలకు రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
న్యూయార్క్ నగరంలోని లోయర్ మన్‌హట్టన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కోబీ గుడ్‌హార్ట్.. అక్కడ స్థానికంగా ఉన్న ఒక ఐటీ కంపెనీలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. అతడి విధి ఏంటంటే.. అమెరికా ఇంధన శాఖకు సంబంధించిన మిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లోన్లను ఇతడు చూస్తుంటాడు. ఈ ఉద్యోగం కోసం 2023లో అతడు న్యూయార్క్ రావాల్సి వచ్చింది. ఇలా రావడం వల్ల అతడు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువులకు దూరం అయ్యాడు.
పెంపుడు కుక్కలపై ప్రేమతో
ఈ లోటును భర్తీ చేసుకునేందుకు గాను.. కోబీ.. తన ఇరుగుపొరుగున ఉండే వారి పెంపుడు కుక్కలను వాకింగ్‌కి తీసుకెళ్లేవాడు. ఈ సరదా కాస్తా.. ఆ తర్వాత ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాగా మారింది. ఈ క్రమంలో గతేడాది అంటే 2025లో కోబీ ‘గుడ్‌హార్ట్ డాగ్ కో’ అనే ఒక లగ్జరీ పెట్-కేర్ కంపెనీని ప్రారంభించాడు. ఇందుకోసం కోబీ తన ఆఫీస్ టైమింగ్స్‌కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తన బిజినెస్ వేళలను సెట్ చేసుకున్నాడు. అలా కోబీ ఆఫీసు వెళ్లడానికి ముందు అంటే ఉదయం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో, ఆపై సాయంత్రం ఆఫీసు అయి ఇంటికి వచ్చాక.. అలాగే వీకెండ్స్, ఇతర సెలవు రోజుల్లో కుక్కలను వాకింగ్‌కి తీసుకెళ్తుంటాడు.
ధనవంతుల పెంపుడు కుక్కలే లక్ష్యం
ఇప్పటికే మార్కెట్లో వందల సంఖ్యలో ఉన్న సాధారణ డాగ్-వాకింగ్ సర్వీసుల లాగా కాకుండా.. కోబీ కేవలం ధనవంతులను టార్గెట్ చేస్తూ దీనిని ఒక ప్రీమియం లగ్జరీ సర్వీస్‌గా మార్చాడు. కుక్కల సైజ్, ప్రవర్తన, యజమానుల అవసరాలను బట్టి వారి నుంచి భారీగానే వసూలు చేస్తాడు. అలా లోయర్ మన్‌హట్టన్‌లోని ధనవంతులు, బిజీగా ఉండే పెంపుడు కుక్కల యజమానుల నమ్మకాన్ని గెలుచుకోవడంతో కోబీ బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం రోజుకు 10-20 కుక్కలను వాకింగ్‌కి తీసుకెళ్తున్నాడు. తన సర్వీసుకు విపరీతమైన డిమాండ్ వస్తుండటంతో.. కొన్ని రోజుల క్రితమే కోబీ ఒక హెల్పర్ ని కూడా నియమించుకున్నాడు.
దీని గురించి కోబీ మాట్లాడుతూ.. తాను చేసే సాఫ్ట్వేర్ జాబ్ వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని.. దాని నుంచి బయటపడటం కోసం ఇలా మూగజీవాలతో గడపడం బాగుందని తెలిపాడు. దీనివల్ల తనకు మానసిక ప్రశాంతత లభించడమే కాక భారీ మొత్తంలో ఆదాయం కూడా వస్తోందని చెప్పాడు.
