ప్చ్..మళ్లీ పెరిగాయి : తెలంగాణలో కరోనా.. కొత్తగా 22 కేసులు

  • Publish Date - May 1, 2020 / 12:17 AM IST

హమ్మయ్య..కేసులు తగ్గుతున్నాయి..అనుకునున్న కొద్ది సేపటికే మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లే తగ్గి..మరలా పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత మూడు, నాలుగు రోజులుగా..సింగిల్ డిజిట్ కే పరిమితం అయిన కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 22 కేసులు పెరిగాయి. 

మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది. గురువారం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 28కి చేరింది. గురువారం 33 మంది కొలుకుని ఇంటికి వెళ్లిపోయారు. తాజాగా నమోదైన 22 కేసులు కూడా GHMC పరిధిలోవే కావడం గమనార్హం. మార్కెట్లలో పనిచేస్తున్న వారి నుంచి కొంతమందికి సోకినట్లు అధికారులు గుర్తించారు. మలక్ పేట గంజ్, పహాడీషరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ వైరస్ మరో మూడు షాపుల యజమానులకు సోకింది. వీరి ద్వారా కుటుంబసభ్యులకు సోకింది. ప్రస్తుతం వీరందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మలక్ పేట గంజ్, పహాడీషరీఫ్ ప్రాంతాలను కంటైన్ మెంట్ ప్రాంతాలుగా గుర్తించారు. కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

రాష్ట్రంలో GHMC మినహా..మిగిలిన జిల్లాల్లో క్రమేణా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే 11 కరోనా రహిత జిల్లాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సంగారెడ్డి, జగిత్యాల చేరాయి. గత 14 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాలుగా కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాల పల్లిలను గుర్తించారు.