AIIMS Doctors : రాందేవ్ కామెంట్స్..బ్లాక్ డేకు ఎయిమ్స్ డాక్టర్ల పిలుపు

పతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగ‌ళ‌వారం బ్లాక్ డేను పాటిస్తున్నారు.

Aiims Doctors To Observe Black Day On June 1 Over Baba Ramdevs Comments

AIIMS Doctors అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగ‌ళ‌వారం బ్లాక్ డేను పాటిస్తున్నారు. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ అవమానకర, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్(ఎఫ్ఓఆర్‌డీఏ) ఈ నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ నిరసనల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుప‌డిన స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా వైద్యులు కొవిడ్ యోధులుగా మారి సేవ‌లందిస్తుంటే వారిపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్య‌లు అత్యంత హేయ‌మ‌ని డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ తీవ్రంగా ఖండించింది. యోగ గురు వ్యాఖ్య‌లు దేశ ఆరోగ్య వ్య‌వ‌స్ధ‌ల ర్వీర్యానికి దారితీసే విధంగా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వ్యాక్సినేష‌న్ పై అస‌త్య ప్ర‌చారం చేసిన రాందేవ్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎయిమ్స్ వైద్యుల అసోసియేష‌న్ కోరింది. రాందేవ్ పై అంటువ్యాధుల చ‌ట్టం కింద కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియకు వ్య‌తిరేకంగా చేసిన వ్యాఖ్య‌లు క్ష‌మార్హం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

ఓ వ్యాపారవేత్తగా ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే బాబా రాందేవ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఎంఏ మండిపడింది. ఈ మేరకు కేంద్రానికి 14 పేజీల ఫిర్యాదును పంపింది. రాందేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లోపతిని ‘స్టుపిడ్ సైన్స్’గా కొట్టిపారేశారు. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న ఐఎంఏ భేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.