Boy With Hair : అతడు మనిషే. కానీ, అతడిని చూస్తే.. మనిషేనా అనే డౌట్ కలగక మానదు. మనిషా? జంతువా? అనే సందేహం రాక మానదు. అంతేకాదు.. అతడిని చూస్తే భయపడిపోతారు. ఎందుకంటే.. అతడి రూపం అలా ఉంటుంది మరి. అతడి ఒళ్లంతా వెంట్రుకలే.
మధ్యప్రదేశ్ నంద్ లేతా గ్రామానికి చెందిన లలిత్ పాటిదార్ వయసు 17ఏళ్లు. అతడి శరీరం మొత్తం అంటే.. టాప్ టు బాటమ్.. వెంట్రుకలే. లలిత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అదే hypertrichosis (వెంట్రుకలు విపరీతంగా పెరగడం). దీన్ని werewolf syndrome అని కూడా అంటారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
లలిత్ కు.. ఆరేళ్ల వయసులో ఈ వ్యాధి బయటపడింది. అప్పటి నుంచి అతడి శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమైంది. తాను చూడటానికి తోడేలులా ఉంటానని, కరుస్తానేమో అని.. స్కూల్ లో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ వాపోయాడు. వెంట్రుకలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటానని లలిత్ చెప్పాడు. కాగా, మధ్యయుగం నాటి నుంచి కేవలం 50 మందికే ఈ వ్యాధి వచ్చిందని, దీనికి చికిత్స లేదని డాక్టర్లు తెలిపారు.
లలిత్ మొత్తం శరీరం వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అతడి క్లాస్ మేట్స్ అతడిని మంకీ బాయ్ అని పిలుస్తారు. తాను వారిని ఎక్కడ కరుస్తానో అని వారంతా భయపడతారని లలిత్ తెలిపాడు. ”నేను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. నా తండ్రి రైతు. ప్రస్తుతం నేను 12వ గ్రేడ్ చదువుతున్నా. చదువుకుంటూనే.. వ్యవసాయంలో నా తండ్రికి నేను సాయం చేస్తాను” అని లలిత్ తెలిపాడు.
”నేను పుట్టిన సమయంలోనే డాక్టర్ నాకు షేవింగ్ చేశాడని తల్లిదండ్రులు చెబుతారు. నాకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు ఒళ్లంతా వెంట్రుకల విషయాన్ని గమనించ లేదు. ఆరేళ్ల వయసులో నాకు తెలిసింది. ఇతరుల కన్నా భిన్నంగా నా శరీరం అంతా వెంట్రుకలు మొలుస్తున్నాయని గుర్తించాను. ఆ తర్వాతే తెలిసింది. హైపర్ ట్రై కోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని. ప్రపంచ వ్యాప్తంగా 50మంది మాత్రమే ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిసింది. నా కుటుంబంలో ఎవరికీ ఇలాంటి జబ్బు లేదు. తొలిసారి నాకే ఈ జబ్బు వచ్చింది” అని లలిత్ చెప్పాడు.
కాగా, నా పరిస్థితి గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడుతున్నారు అని లలిత్ వెల్లడించాడు. నన్ను చూసి పిల్లలు జడుసుకునే వారు. చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. వయసు పెరిగాక అర్థమైంది. పిల్లలు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో తెలిసింది. నేను మృగంలా కరుస్తానేమో అని పిల్లలు భయపడే వారని లలిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంట్రుకలు బాగా పెరిగితే.. ట్రిమ్ చేస్తానని లలిత్ తెలిపాడు. అది తప్ప తన దగ్గర మరో మార్గం లేదన్నాడు. అరుదైన వ్యాధి వేధిస్తున్నా.. ఒళ్లంతా వెంట్రుకలు ఇబ్బంది పెడుతున్నా.. నేను నిరాశపడను అని లలిత్ అంటాడు. సంతోషంగా బతికేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పడం విశేషం.