ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు ఆస్తుల వివాదంపై ఆయన కొడుకు దాసరి అరుణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. ఈ సందర్భంగా మరో కొడుకు దాసరి ప్రభు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
ప్రతి చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తున్నారని మండిపడ్డారాయన. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేమీ లేవన్నారు. తామంతా కూర్చొని మాట్లాడుకుంటే..పరిష్కారమౌతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అరగంట సేపు కూర్చొని మాట్లాడుకుంటే..పరిష్కారమౌతాయని..దాసరి నారాయణరావు పేరు ఇలా బజారుకు వచ్చేది కాదన్నారు.
ఈ సందర్భంగా దాసరి ప్రభు చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. దాసరి ప్రభు ఆరోపిస్తున్నట్లు తన వెనుక ఎవరూ లేరన్నారు. గత మేలో కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రభు డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు అందరిదీ అని, తనకు వచ్చిన కొరియార్ తీసుకొనేందుకు అక్కడకు వెళ్లడం జరిగిందని స్పష్టం చేశారు. తన ఇంటి గోడ నేను గోడ దూకితే తప్పేంటి అని ప్రశ్నించారు.
దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తుల గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ నెల 24న దాసరి అరుణ్ కుమార్ తాగిన మైకంలో తమపై దాడిచేశారని.. ఆస్తి కోసమే తనను వేధిస్తున్నారని దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికిచేశాడని ప్రభు ఆరోపించారు. ఆస్తులపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగా .. అరుణ్ తనను బెదిరిస్తున్నాడన్నారు. అరుణ్ కుమార్ రాత్రి సమయంలో అనుచరులతో గోడదూకి తన ఇంట్లోకి ప్రవేశించాడని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్ ఇంటి గేటు దూకి లోపలికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు.
హైదరాబాద్ శివార్లలో తమ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్‌లో కొన్ని ఎకరాల్ని అరుణ్ అమ్మేశాడని ప్రభు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకూ తనకు ఇవ్వలేదంటున్నారు. దాసరికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని అరుణ్ ఇప్పటికే అమ్మేశాడని, వాటి లెక్కా పత్రాలు తెలియకుండా పోయాయంటున్నారు దాసరి ప్రభు.
బతికున్నంత కాలం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న దాసరి కుటుంబంలోని సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు సమాచారం. పెద్దన్నగా చిరంజీవి ఇరువురితో చర్చిస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.