కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న బాధితులకు వారి ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందించాలని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. ఇంట్లోనే కరోనా ట్రీట్ మెంట్ అందిస్తే.. గాంధీ ఆస్పత్రిలో ఉండే వారి సంఖ్య మరింత తగ్గిపోతుందని చెప్పారు.
కానీ, క్షేత్ర స్థాయిలో పని చేసే వారి మీద మరింత భారం పడుతుందని ఈటల తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషి వల్లనే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్ లేదా ANMలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కొక్కరికి వంద ఇళ్ల బాధ్యత అప్పగించామని జిల్లా అధికారులు మంత్రికి తెలిపారు. వీరందరూ రోజూ వారికి కేటాయించిన ఇళ్లను సందర్శించి థర్మో స్కానర్ ద్వారా ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రత పరీక్ష చేస్తారన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలించి, ఉంటే వారికి పరీక్షలు చేయిస్తారని మంత్రికి వివరించారు. గర్భిణీ స్త్రీలు కంటైన్మెంట్ ప్రాంతంలో ఉంటే కరోనా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. కరోనా వల్ల వ్యాక్సిన్ వేసే శాతం తగ్గిందని, ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సిన్లు పూర్తయ్యేలా చూడాలని కోరారు.