గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్, కొవిడ్ హాట్ స్పాట్ గా జియాగూడ

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్

  • Publish Date - May 14, 2020 / 08:05 AM IST

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్ కేసులు నమోదైతే ఇందులో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. 11న 79, 12న 37, 13న 39 కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రతతో గ్రేటర్ ప్రాంతంలో హాట్ స్పాట్ల సంఖ్య పెరిగిపోతోంది. వనస్థలిపురం తర్వాత తాజాగా జియాగూడ మరో కరోనా హాట్ స్పాట్ గా మారింది. నిన్న(మే 13,2020) ఒక్క రోజే జియాగూడలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రామకృష్ణపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. కొత్తగా నాగోల్ పరిధిలో 4 కేసులు     నమోదయ్యాయి. రోజురోజుకి వైరస్ వ్యాప్తితో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజుల వ్యవధిలో వలస కూలీల కేసులు 35 నమోదు కావడం మరింత దడ పుట్టిస్తోంది. 

వైరస్‌కు కేంద్ర బిందువుగా మలక్‌పేట్‌ గంజ్, జియాగూడ మేకలమండి, సబ్జిమండి మార్కెట్లు:
కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్‌లో 860 మంది వైరస్‌ బారిన పడగా, వీరికి సన్నిహితంగా మెలిగిన మరో 8 వేల మంది కార్వంటైన్‌కు కారణమైంది. మర్కజ్‌ కేసులు గుర్తించి, చికిత్సల తర్వాత వైరస్‌ తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. ఇటీవల ఒక్కసారిగా మళ్లీ విజృంభించింది. మలక్‌పేట్‌ గంజ్, జియాగూడ మేకలమండి, సబ్జిమండి మార్కెట్లు వైరస్‌కు కేంద్ర బిందువుగా నిలిచాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మలక్‌పేట్‌గంజ్‌ మార్కెట్లోని ముగ్గురు వ్యాపారులకు, వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరించింది.

పల్లి నూనె వ్యాపారి ద్వారా వైరస్ వ్యాప్తి:
ఇలా ఒక్క పల్లి నూనె వ్యాపారి ద్వారానే వనస్థలిపురం, హుడాసాయినగర్‌ కాలనీ, ఎస్‌కేడీకాలనీ, తిరుమలానగర్‌లో కేవలం నాలుగైదు కుటుంబాల్లో 45 మందికి వైరస్‌ విస్తరించగా..ముగ్గురు మృతి చెందారు. ఇక మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 11 మంది మేకలమండి, సబ్జిమండి మార్కెట్లలో పని చేశారు. వీరి ద్వారా జియాగూడ, దుర్గానగర్, ఇందిరానగర్, వెంకటేశ్వర కాలనీల్లో 71 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 500 మందికిపైగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. కుటుంబంలో ఒకరికి వైరస్‌ సోకితే.. ఆ తర్వాత ఇతర సభ్యులంతా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. తండ్రి ఒకచోట.. తల్లి మరోచోట.. పిల్లలు ఇంకో చోట.. ఇలా విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో వార్డులో రోజుల తరబడి ఉండాల్సి రావడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు కూడా 28 రోజుల పాటు ఇంట్లోనే బందీ కావాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో అండగా నిలవాల్సిన బంధువులు కూడా భయంతో ముఖం చాటేస్తుండటం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది.

జియాగూడలోనే ఎందుకంటే?
జియాగూడ మాంసం, కూరగాయలు, ఇతర మార్కెట్లకు ప్రధాన కేంద్రం. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారంతా ఇక్కడే ఎక్కువగా ఉంటారు. బస్తీలు కూడా ఇరుకుగా జనం రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కో కాలనీలో 350 నుంచి 500 నివాసాలు ఉంటాయి. ఒక్కో ఇంట్లోని ఇరుకు గదుల్లో 10 నుంచి 25 మంది వరకు ఉంటారు. వీరంతా మేకలమండి, సబ్జిమండి మార్కెట్లపై ఆధారపడి జీవిస్తుంటారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 11 మంది ఇక్కడే పని చేస్తుంటారు. వీరి ద్వారా ఇతరులకు వైరస్‌ విస్తరించింది. ఇక్కడ పని చేస్తున్న తోటి కూలీలు, వ్యాపారులకు కనీస ఆరోగ్య స్పృహ లేక పోవడం, చిన్న వైరస్‌ తమనేం చేస్తుందిలే? అనే నిర్లక్ష్యమే వీరి కొంప ముంచింది. 

ఒకవైపు చాపకింది నీరులా వైరస్‌ విస్తరిస్తుంటే..మరో వైపు మార్కెట్ల చుట్టు విచ్చలవిడిగా తిరిగారు. దీంతో ఒక్కసారిగా వైరస్‌ విజృంభించింది. ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ 71 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, వందలాది మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేసులు తీవ్రరూపం దాల్చడంతో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు.

Read Here>>హైదరాబాద్ శివార్లలో చిరుత భయం, మరోసారి తప్పించుకుంది