తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం షాపులు తెరుచుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం షాపులు తెరుచుకోగా.. తెలంగాణలో కూడా పలు జోన్లలో మద్యం షాపులు తెరుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. పక్కరాష్ట్రాల్లో దుకాణాలు తెరవడం కారణంగా అక్కడి నుంచి రాష్ట్రంలోకి స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు.
‘గుడుంబాను రూపుమాపి సాంఘిక దురాచారాలు లేకుండా చేయాలని చూశామన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కరోనా మూలంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులను బంద్ చేశామని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలతో చుట్టూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి. మద్యం దుకాణాలు మూసివేయడంతో గుడుంబా, సెకండ్స్ మద్యం విక్రయం ప్రారంభమైందని అన్నారు. మద్యం దుకాణాలు తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని, మరోవైపు డిస్టిలరీ కంపెనీలు కూడా గొడవ చేస్తున్నాయని కేసీఆర్ వివరించారు.
రాష్ట్రంలో 2,200 మద్యం షాపులకు గానూ కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులను మినహాయించి మిగిలిన అన్నింటినీ తెరుస్తామన్నారు. రెడ్‌జోన్ సహా అన్నిచోట్లా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరుస్తున్నట్టు చెప్పారు. కానీ, బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16శాతం ధర అదనంగా పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత కూడా ఈ ధరలను తగ్గించేది లేదన్నారు.
అమ్మేవారు, కొనుగోలు చేసేవారు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలు పాటించకున్నా, మాస్క్‌లు లేకుండా మద్యం కొనుగోలు చేసినా లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. నో మాస్క్ నో లిక్కర్.. నో మాస్క్ నో గూడ్స్’నినాదం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు మద్యం షాపులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మందుబాబులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటివరకూ మద్యం కోసం పక్కరాష్ట్రాల వైపు పరుగులు పెట్టినవారంతా రాష్ట్రంలోనే లభ్యం కావడంతో మద్యం దుకాణాల మందు క్యూ కట్టేస్తున్నారు.
Also Read | తెలంగాణలో తెరుచుకోనున్న మద్యం దుకాణాలు.. కేసిఆర్ ప్రకటన