కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతిన్నట్టు చెప్పారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని చెప్పారు. ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు ఉన్నాయని అన్నారు.
అయితే వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే విషయాన్ని వివరించినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని మండిపడ్డారు. వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించడం లేదన్నారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలని కేసీఆర్ కోరారు. FRBM రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల చెల్లింపులను (డిఫర్మెంట్) వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశామన్నారు. అయినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
ఎందుకు కేంద్రం పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. అలా చేస్తే మీ మీద భారం పడుతుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించి రూ.2,500 కోట్ల వడ్డీలను RBI కట్ చేసుకుందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదన్నారు. లేదంటే రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సరైనది కాదన్నారు. స్పెషల్ రైళ్లు, రిజర్వేషన్ల పేరుతో దోపిడీ అవసరమా అని ప్రశ్నించారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు.
విద్యుత్ చట్టం.. సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఈ బిల్లు ఉందన్నారు. పార్లమెంట్లో పాస్ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల ERC చైర్మన్ల అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. కేంద్రం లాగేసుకునేందుకు ఈ బిల్లును తెచ్చిందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ సబ్సిడీలు ఎత్తేయాల్సి వస్తుందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు కోల్పోతామన్నారు. అందరూ సబ్సిడీ లేకుండా విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నగదు బదిలీ రూపంలో సబ్సిడీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read | ఏయే జోన్లలోనంటే? మద్యం విక్రయాలపై కేసీఆర్ క్లారిటీ