వీల్‌ చైర్‌లోనే జనంలోకి.. గాయపడిన సింహం ప్రమాదకరం!

Mamata Banerjee Warns Bjp: గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇది కేజీఎఫ్‌ మూవీ డైలాగ్‌.. కానీ ఇలాంటి వార్నింగే బీజేపీకి ఇచ్చారు మమతా బెనర్జీ. చెప్పినట్టుగానే వీల్‌చైర్‌పై ఎన్నికల సంగ్రామంలో దూకారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వీల్‌ చైర్‌పై కూర్చోనే కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాయపడిన సింహం మరింత ప్రమాదకరం అంటూ హెచ్చరించారు.

తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోన్నాను కానీ.. ఎక్కడా తలవంచలేదని.. వంచనని స్పష్టం చేశారు దీదీ.. కోల్‌కతాలో 5 కిలోమీటర్ల పాటు జరిగిన రోడ్‌ షోలో తృణమూల్‌ సీనియర్‌ నేతలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. తన ప్రచారం ఈ ఒక్క రోజుతో ముగియదని.. వీల్‌ చైర్‌పైనే బెంగాల్‌ మొత్తం పర్యటిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. గాయపడ్డారు.. ఈ ఘటనలో ఆమె కాలుకు గాయమైంది.

నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకున్న దీదీ.. డిశ్చార్జ్‌ అవ్వగానే ఎన్నికలపై దృష్టి పెట్టారు. తొలివిడత ఎన్నికల ప్రచారం తుది గడువు దగ్గర పడుతుండటంతో నాలుగు వారాల పాటు రెస్ట్‌ తీసుకునేందుకు దీదీ నిరాకరించి ప్రచారంలో పాల్గొంటున్నారు. దీదీ గాయపడటంతో వాయిదా పడిన తృణమూల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తృణమూల్‌ వర్గాలు తెలిపాయి.

మరోవైపు.. మమత సానుభూతి కోసమే డ్రామాలు చేస్తోందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఈసీ కూడా మమతపై జరిగింది దాడి కాదు.. కేవలం ప్రమాదమే అని చెప్పింది. ఈ సమయంలోనే దీదీ వీల్‌చైర్‌పై ప్రచారానికి రావడంతో బీజేపీ మాటల దాడి పెంచింది.

ట్రెండింగ్ వార్తలు