Megastar Chiranjeevi Condolences To Actor Potti Veeraiah
Chiranjeevi: దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. హృద్రోగంతో ఆసుపత్రిలో చేరిన ఆయన దురదృష్టవశాత్తు.. ఆదివారం (25 ఏప్రిల్) సాయంత్రం కన్నుమూశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల కళాకారుడు. సినీరంగంలో దశాబ్ధాల పాటు ఆయన సేవలందించారు.
Potti Veeraiah : హాస్యనటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..
పరిశ్రమకు సుదీర్ఘ కాలం సేవలందించిన వీరయ్య మృతి పట్ల సానుభూతి వ్యక్తపరుస్తూ.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ- ‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను’’ అని అన్నారు.
సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడినని.. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్లడించారు.. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారని ఆ ఇంటర్వ్యూలో పొట్టి వీరయ్య తెలిపారు..