మరోదారి లేదు, అప్పటివరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాదాపు

  • Publish Date - May 10, 2020 / 02:43 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాదాపు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాదాపు అన్ని దేశాలపైనా కరోనా పంజా విసిరింది. సుమారు 214 దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 40లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 2లక్షల 78వేల మందిని కరోనా బలితీసుకుంది. ఇంకా ఎంతమంది దీని బారిన పడతారో, ప్రాణాలు పోతాయో తెలీదు. వైరస్ వెలుగుచూసిన 4 నెలల వ్యవధిలోనే 40లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి అంటే, ఈ వైరస్ తీవ్రత ఏం రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి కరోనాను కట్టడి చేయడం తప్ప మరో మార్గం లేదు.

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే:
తెలంగాణలో కరోనా తీవ్రతపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, మరో మార్గం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తికి ఆస్కారం ఉన్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం లాంటివి కొనసాగాలి:
కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న కమిషనర్లను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేయాలని చెప్పారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి-బేసి విధానంలో భాగంగా దుకాణాల నిర్వహణను కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం లాంటివి కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కమిషనర్లపై ఉందన్నారు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా మహమ్మారితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై దృష్టిసారించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

ప్రతి ఆదివారం పది గంటలకు – పది నిమిషాలు:
పురపాలక, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా రూపొందించిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై కేటీఆర్ సమీక్షించారు. సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ లాంటి వ్యాధుల నివారణకు ఇప్పటినుంచే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేలా రేపటినుంచి పురపాలక శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి ఆదివారం పది గంటలకు – పది నిమిషాలు పేరిట నివారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ తమ ఇళ్లలోనే కార్యక్రమంలో పాల్గొని నిల్వనీరు లేకుండా చర్యలు తీసుకోవాలని.. ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కేటీఆర్ కోరారు.

తెలంగాణలో 1163 కరోనా కేసులు, 30 మరణాలు:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఒకేరోజున 31 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొవిడ్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. ఈ క్రమంలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 1163కి పెరిగాయి. మరణాలు 30కి చేరాయి. పాజిటివ్ కేసుల్లో 30 జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్నాయి. ముంబై నుంచి తెలంగాణకు తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడైంది. 

18 రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు:
రాష్ట్రంలో కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్నిసార్లు పదిలోపు ఉంటున్నాయి. ఏప్రిల్ 21న పాజిటివ్ కేసులు 56 నమోదు కాగా.. 23న మరో 27 వచ్చాయి. అప్పటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు కొంత రిలాక్స్ అయ్యారు. కరోనా గండం తప్పింది అని సంతోషించారు. ఇంతలోనే ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం షాక్ కి గురి చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత భారీగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్న మరో 24 మంది శనివారం(మే 9,2020) డిశ్ఛార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 751కి చేరుకుంది. మరో 382 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.