వైరస్ లక్షణాలు లేకున్నా గర్భిణులకు కరోనా పరీక్షలు, ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Publish Date - May 3, 2020 / 02:11 AM IST

ఏ మాత్రం అలసత్వం చూపినా కరోనా వైరస్ మహమ్మారి కాటేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా, అన్ని వయసుల వారిని అటాక్ చేస్తోంది. పిల్లలు, యువత, పెద్ద, ముసలి అనే తేడా లేదు. కరోనా ఎవరిపైన అయినా దాడి చేయొచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులపై దృష్టి సారించింది. వైరస్ లక్షణాలు లేకున్నా గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

హాట్‌స్పాట్‌ జిల్లాలు.. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పరీక్షలు తప్పనిసరి:
రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత ఉన్న హాట్‌స్పాట్‌ జిల్లాలు (రెడ్‌జోన్‌), కేసులు నమోదవుతున్న ఇతర జిల్లాల్లోని కంటెయిన్‌మెంట్‌ జోన్లలో గర్భిణులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితారాణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను అనుసరించి గర్భిణులకు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు దాదాపు 54 వేల ప్రసవాలు:
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు దాదాపు 54 వేల ప్రసవాలు అవుతున్నాయి. వీటిలో 30 వేల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. సురక్షిత ప్రసవాలను పెంచడంలో భాగంగా ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రసవాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంది. హైరిస్క్‌, సాధారణ ప్రసవాలుగా రెండు కేటగిరీలు చేశారు. హాట్‌స్పాట్‌ జిల్లాలుగా గుర్తించిన హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో మే నెలలో 21,127 మందికి ప్రసవ తేదీలు ఇచ్చారు.

ప్రసవ తేదీకి 5 రోజులు ముందుగా:
* ప్రసవ తేదీకి ఐదు రోజుల ముందు గర్భిణులను ఆస్పత్రికి తరలించి కరోనా నిర్ధారిత నమూనాలు సేకరించి ఫలితాలను హైదరాబాద్‌కు పంపిస్తారు. ఒకవేళ అత్యవసరంగా కాన్పునకు వచ్చినా కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి.
* కేసీఆర్‌ కిట్‌ సమాచారం ఆధారంగా రాష్ట్రంలో ప్రతి నెల ప్రసవాలకు సంబంధించి సమాచారం ఆధారంగా చేసుకుని వారిని దగ్గర్లోని ఆస్పత్రులు, నిపుణులు ఉన్న కేంద్రాలకు తరలిస్తున్నారు.
* పౌష్ఠికాహారలోపం, రక్తహీనత, ఒకటి కన్నా ఎక్కువ కాన్పులు అయినవారు, మధుమేహం, మూర్ఛ, గుండె తదితర జబ్బులు ఉన్నవారిని హైరిస్కు కింద పరిగణిస్తారు. వీరిని నిపుణులు, ఆధునిక సదుపాయాలు ఉన్నచోటికి తరలిస్తున్నారు.
* హాట్‌స్పాట్‌ జోన్లలో మే నెలలో ప్రసవించే వారిలో 3,869 మంది హైరిస్క్‌ జాబితాలో ఉన్నారు.
* ఏప్రిల్‌లో రాష్ట్రంలో 45,489 మంది ప్రసవిస్తారని అంచనా వేయగా ఆ మేరకు ప్రసవాలు అయ్యాయని అధికారులు చెప్పారు.
* మే నెలలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 50,978 మందికి ప్రసవ తేదీ సమీపించనుంది.
* హైదరాబాద్‌ జిల్లాలో 5,544 మంది గర్భిణులు ఉన్నారు. వారిలో 425 మంది హైరిస్క్‌లో ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
* వలస కూలీలు గుంపులుగా నివసించే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండటంతో అక్కడ ఉండే గర్భిణులను గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నారు.

దేశంలో 37వేల 776 కరోనా కేసులు, 1223 మరణాలు:
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,061కి పెరిగింది. మృతుల సంఖ్య 29కి చేరింది. 499మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 533 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,525కి పెరిగింది. ఏపీలో కరోనాతో 33మంది చనిపోయారు. 441 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1051 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 37వేల 776కి చేరింది. 10వేల 18మంది కోలుకున్నారు. 26వేల 535మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 1,223మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా 34లక్షల 81వేల కరోనా కేసులు, 2లక్షల 44వేల మరణాలు:
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 21 లక్షల 28 వేల 410. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 44 వేల 666 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 11 లక్షల 8 వేల 389 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల వివరాలు :
* అమెరికా – 67,444
* స్పెయిన్‌ – 25,100
* ఇటలీ – 28,710
* యూకే – 28,131
* ఫ్రాన్స్‌ – 24,760
* జర్మనీ – 6,812
* టర్కీ – 3,336
* రష్యా – 1,222
* బ్రెజిల్ ‌ -6,750
* ఇరాన్ ‌- 6,156
* చైనా – 4,633
* కెనడా – 3,566
* బెల్జియం – 7,765
* పెరూ – 1,200
* నెదర్లాండ్స్‌ – 4,987
* స్విట్జర్లాండ్‌ – 1,762
 * ఈక్వెడార్ ‌- 1,371
* పోర్చుగల్ ‌- 1,023
* స్వీడన్‌ – 2,669
* ఐర్లాండ్ ‌- 1,286
* మెక్సికో – 1,972 మంది మృతి