Bharadwaz
Bhardwaj : తెలుగు వారి ప్రతిభ మరోమారు అమెరికాలో మార్మోగిపోయింది. ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభకనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందాడు విశాఖ యువకుడు. విశాఖ జిల్లా సీలేరుకు చెందిన భరద్వాజ్ అమెరికాలోని యూఎంకేసీలో పిహెచ్ డి చేస్తున్నాడు. ఖగోళ బౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను సదరు యూనివర్శిటీ గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేసింది. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరధ్వాజ్ పరిశోధనలు చేశాడు. ఏడేళ్ళపాటు అతని పరిశోధనలు కొనసాగాయి.
విశాఖ జిల్లా సీలేరుకు చెందిన భరద్వాజ్ చిన్ననాటి నుండి చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు. తండ్రి ఏపి జెన్ కో సహాయ కార్య నిర్వాహక ఇంజనీర్ కామేశ్వరావు. హైద్రాబాద్ లో ప్రాధమిక విద్య పూర్తిచేసి విజయవాడ కేఎల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళాడు. యూఎంకేసీ విశ్వవిద్యాలయం అర్హత పరీక్షలో ప్రధమస్ధానం దక్కించుకుని పరిశోధనలకు ఎంపికయ్యాడు.
పరిశోధనా సమయంలో దాదాపు ఎనిమిది సంస్ధలు ఉపకార వేతనాలతో భరద్వాజకు తోడ్పాటునందించాయి. భరద్వాజ్ పరిశోధనల ప్రతిభను గుర్తింపుగా అస్ట్రోనామికల్ సొసైటీ గోల్డ్ మెడల్ అందించింది. ప్రస్తుతం భరద్వాజ్ అక్కడే పోస్టు డాక్టరేట్ చేయనున్నాడు. ఇందుకుగాను నాసా ఉపకార వేతనం అందించనుంది. భరద్వాజ్ కు లభించిన గుర్తింపు పట్ల అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.