అదే నిర్లక్ష్యం : పొడ్చన్ పల్లి బోరు బావి విషాదం..అసలు ఏం జరిగింది ? 

  • Publish Date - May 28, 2020 / 12:16 AM IST

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన మంగళి భిక్షపతి తన వ్యవసాయ పొలంలో మూడు బోర్లు తవ్వించారు. నీళ్లు పడకపోవడంతో 2020, మే 27వ తేదీ బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి వాటిని పూడ్చేందుకు పూనుకున్నాడు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలోని పొలం దగ్గరికి భిక్షపతి కుటుంబ సభ్యులతోపాటు.. అతని కూతురు నవనీత, ఆమె కుమారుడు మూడేళ్ల సాయివర్ధన్‌ కూడా వచ్చాడు. మూడు బోరు బావులలో ఒకదానిని పూడ్చుతుండగా.. సాయివర్ధన్‌ ఆడుకుంటూ సమీపంలోని మరో బోరు బావి గుంతలో పడిపోయాడు. 

సాయివర్ధన్‌ బోరుబావిలో పడిపోవడాన్ని గుర్తించిన భిక్షపతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే చీర, దోతికి ముడేసి బోరుగుంత లోపలికి పంపారు. అయినా ఫలితం లేకపోయింది. నాలుగైదు నిమిషాలపాటు బాలుడు డాడీ.. డాడీ.. అంటూ ఏడ్చాడని.. ఆ తర్వాత ఏం వినబడలేదని కుటుంబసభ్యులు తెలిపారు.

భిక్షపతి వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరోవైపు బాలుడు బోరు బావిలో పడిపోయిన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూటీంలను రప్పించారు. 108 వాహనంతోపాటు, అగ్నిమాపక యంత్రాలను కూడా రప్పించారు. ముందుగా బోరు బావిలోకి ఆక్సిజన్‌ను పంపించి, బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. జేసీబీతో బోరుబావి చుట్టూ తవ్వారు. రాత్రి కూడా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి సహాయక చర్యలు కొనసాగించారు.

బాలుడు బోరుబావిలో పడిపోయాడన్న సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రంతా అక్కడే ఉండి.. బాధితులకు అండగా నిలిచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ… ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలకు పలు సూచనలు చేశారు. అయితే.. అటు… నాయకులు, ఇటు అధికారులు ఎంత ప్రయత్నించినా ఆ బాలుడిని కాపాడలేకపోయారు.

Read: మెదక్ లో విషాదం : బోరు బావిలో పడిన బాలుడు మృతి