తెలంగాణలో మారిపోయిన వెదర్..కుండపోత వర్షం

  • Publish Date - June 1, 2020 / 02:06 AM IST

తెలంగాణలో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, అబిడ్స్‌, కోఠి, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, ఘట్ కేసర్‌, మోహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్‌, పంజాగుట్టలలో ఏకధాటిగా వాన కురిసింది. కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో.. GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. 

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లాలో కొమురవెళ్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వానపడింది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. తెలంగాణ ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అదికాస్తా వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను జూన్ 3నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను చేరే అవకాశం ఉందని, ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. (జాగ్రత్త, మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు)