Asthma : ఆయాసం,పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? ఉబ్బసంగా అనుమానించాల్సిందేనా?

ఉబ్బసం వ్యాధి లక్షణాలలో వ్యాధిగ్రస్తులకు ముందుగా, ప్రధానంగా కనిపించేది ఆయాసం. అలాగే శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Asthma

Asthma : ఉబ్బసం వ్యాధి చాపక్రింద నీరులా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్ల మంది ఆస్తమా సమస్య బాధిస్తోంది. ఒక్క భారత్‌లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఉబ్బసం అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉబ్బసం కూడా ఒకటిగా చెప్పవచ్చు. పిల్లలలోను పెద్దవారిలోను ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రావడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. ముందుగా కనిపించే లక్షణం ఆయాసం.

పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. ఆయాసం అంటే ఊపిరి అందకపోవడం. శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఏదైన పని లేదా వ్యాయామం చేసినప్పుడు ఈ ఆయాసం అధికమౌతుంది. ఉబ్బసం వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపుగా మారుతాయి. ఈ వాపు వలన శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుగా మారుతుంది.

గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఇలా జరగడానికి వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు ముఖ్య కారణంకాగా, పొగాకు, చల్లని గాలి, కొన్ని రకాల స్ర్పేలు, పెంపుడు జంతువుల ధూళి, మానసిక ఆందోళన మొదలైనవి కూడా ఇతర కారణాలు. పిల్లలలో సాధరణంగా వచ్చే జలుబు వంటి వైరస్ వ్యాధులు కూడా ఉబ్బసానికి దారితీయవచ్చు.

ఉబ్బసం వ్యాధి లక్షణాలలో వ్యాధిగ్రస్తులకు ముందుగా, ప్రధానంగా కనిపించేది ఆయాసం. అలాగే శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతను నివారించటానికి శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు వ్యాధి గ్రస్తులకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

మందులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా , మళ్ళీ తిరిగి రావటం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. అందువల్ల తగిన జాగ్రత్తలు వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమపానానికి, దుమ్మూదూళికి దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఇంట్లో బూజు దులపడం, దుమ్ము పడే పనులు వంటివి ఆస్తమా ఉన్నవారు చేయవద్దు. చలి కాలంలో మంచులో తిరగడం, గాలిలోని వుండే పుప్పొడి రేణువులును, ప్రమాదకర రసాయనాలును, ఘాటు వాసనలు పీల్చడం వంటి చర్యలకు దూరంగా వుండాలి.