Sleep :
Sleep : మనిషి ఆరోగ్యంగ జీవించాలంటే ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. రోజువారిగా నిద్రకు సరిపడినంత సమయం కేటాయించాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. నిద్రలేమి ఏర్పడితే మాత్రం ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. దీని వల్ల హార్మోనుల్లో అసమతుల్యత, ఇన్‌ఫ్లమేషన్, ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రోజూ ఒకే సమయానికి నిద్ర పోవటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. రాత్రి నిద్ర సమయంలో వేడుకలు, స్నేహితులతో పార్టీల పేరుతో నిద్రకు భంగం కలిగేలా చేసుకోవటం మంచిదికాదు. కాబట్టి అలాంటి వాటిని రాత్రి సమయంలో లేకుండా చూసుకోవాలి. పగలంతా పనిలో నిమగ్నమై రాత్రుళ్లు చాటింగ్, వెబ్ సిరీస్‌ల సరిగా నిద్ర పోరు. ఇలాంటి వారు అనారోగ్యాలు, ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోను విడుదలవుతుంది. టీవీ, మొబైళ్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి దీని విడుదలను అడ్డుకుని నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి, పడుకునే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
శరీరం తిరిగి పుంజుకోవడానికీ, లోపలి మలినాలను శుభ్రం చేసుకోవడానికీ సాయపడే ప్రక్రియగా నిద్రను చెప్పవచ్చు. నిద్ర సమయాన్ని ఇతర అనవసరమైన కార్యకలాపాలతో వృధాచేయవద్దని నిపుణులు సైతం సూచిస్తున్నారు. తినడానికీ పడుకోవడానికీ మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి. లేదంటే కడుపులో యాసిడ్‌లు తయారై నిద్ర పట్టకుండా చేస్తాయి. కాబట్టి, త్వరగా భోజనం చేసి, అరగంటపాటు నడిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జాజికాయ పొడి కలిపిగానీ, చామంతి టీని కానీ పడుకోబోయే ముందు తీసుకోండి. ఇవి నరాలను శాంత పరిచి, నిద్రపట్టేలా చేస్తాయి. పడుకుని దీర్ఘశ్వాస తీసుకుంటూ దానిపైనే దృష్టి నిలపండి. ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.