Microwave
Microwave : మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఫాస్ట్‌ఫుడ్ తయారీలో మైక్రోవేవ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అందరి వంటిల్లో మైక్రోవేవ్‌లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని సులువుగా వేడి చేసుకుని వేడి వేడిగా తింటున్నారు.
అయితే, మైక్రోవేవ్‌లో వండటం వల్ల ఆహారంలో పోషక విలువలు నశిస్తాయని, ప్లాస్టిక్ గిన్నెలు వాడకం వలన శరీరంలోని హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుందనే భయాలు లేకపోలేదు. ఇంట్లోనే కాదు, వర్క్‌ప్లేస్‌లోని క్యాంటీన్‌లో కూడా మైక్రోవేవ్ ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. బేకరీలలో కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇది పని సులువుగా చేస్తున్న మాట వాస్తవమే ఆరోగ్యానికి హానికూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆహారాలు మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల శరీరానికి అందాల్సిన అనేక పోషకాలకు నష్టం వాటిల్లుతుంది. అలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మైక్రోవేవ్ లో పదార్థాలు వేడి చేయటం వల్ల టాక్సిన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. బ్రోకలీలాంటి కూరగాయలను మైక్రోవేవ్‌లో వండితే వాటిలో ఉండే కొన్ని రకాల ఫ్లేవనాయిడ్లు 97% వరకూ తగ్గిపోతాయని, పొయ్యి మీద ఉడికించడం వల్ల జరిగే నష్టంకన్నా ఇది ఎక్కువ శాతమని తేలింది. ఈ ఫ్లేవనాయిడ్లు కడుపులో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి.
అదే క్రమంలో కొన్ని పరిశోధనల్లో మైక్రోవేవ్ ఉపయోగించటం ద్వారా వండిన ఆహారంలో మంచిదని తేలింది. వాస్తవానికి ఆవిరిలో ఉడికించడం, మైక్రోవేవ్‌లో వండడం వలన ఆహారంలో చాలా రకల ఫ్లేవనాయిడ్లు పెరుగుతాయని, ఇవి గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయని ఆ పరిశోధన స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో ఆవిరి మీద వండడంకన్నా కూడా మైక్రోవేవ్‌లో వండడంవల్ల ఫ్లేవనాయిడ్లు పెరిగాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఉడికించడానికి ఎక్కువ నీరు వాడితే మాత్రం ఫ్లేవనాయిడ్ల శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
ఇదిలా వుంటే మరొక అధ్యయనంలో, కూరగాయల్లో ఉండే ఫినోలిక్స్ మిశ్రమాలు, నీళ్లల్లో ఉడికించినప్పుడు, ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఎలా మారుతున్నాయో పరిశీలించారు. ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండినప్పుడు పాలకూర, కాప్సికం, బ్రోకలీ, గ్రీన్ బీన్స్‌లాంటి వాటిల్లో ఫినోలిక్స్ కోల్పోలేదు కానీ గుమ్మడి, పచ్చి బఠాణీ, ఉల్లికాడలు లాంటి వాటిల్లో ఫినోలిక్స్ ఎక్కువ శాతం నశించాయి.
మైక్రోవేవ్ కుకింగ్‌లో వాడే అధిక ఉష్ణోగ్రతలు కూడా కొన్నిసార్లు హాని కలిగించవచ్చు. ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే దుంపలు, ధాన్యాలలాంటివి వండేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నవాటిని మైక్రోవేవ్‌లో అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు ఎక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం విడుదల అవుతుంది.
చాలా మంది తెలియక అన్నాన్ని పదేపదే మైక్రోవేవ్‌లో వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇలాంటి అన్నం తింటే వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. మైక్రోవేవ్‌లో చికెన్‌ను వేడి చేయడం వల్ల దాని ప్రొటీన్ నిర్మాణం మారుతుంది. ఆ చికెన్ తినడం వల్ల మీ జీర్ణక్రియను పాడవుతుంది. మైక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెట్టినప్పుడు దాని లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో గుడ్డు పగిలిపోతుంది. అందుకే ఇలాంటి ఆహారాలను ఎప్పుడు మైక్రోవేవ్‌లో వేడి చేసి తినకూడదు. ఎల్లప్పుడు సహజంగా చేసే వంటకాలు ఆరోగ్యానికి చాలా మంచిది.
కొన్ని రకాలైన ప్లాస్టిక్ పాత్రలు మైక్రోవేవ్‌కు అనుగుణమైనవి కావు. వేడి చేసినప్పుడు ప్లాస్టిక్, ప్లాలిమర్స్ ఆహారంలోకి చేరే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాలు చిన్నపిల్లల్లో రక్తపోటు పెరగడానికి, రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతాయి. దానివలన డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంతానోత్పత్తి సమస్యలు, ఆస్థమా, ఏడీహెచ్‌డీలకు కూడా దారి తీస్తాయి. అలాగే శరీరంలోకి చేరే రసాయనాలు, హార్మోన్ల సమతుల్యంపై ఎంతవరకూ ప్రభావాన్ని చూపిస్తాయనేది కూడా కచ్చితంగా చెప్పలేమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మొత్తానికి మైక్రోవేవ్‌లో విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితం. దీనిలో వాడే విద్యుదయస్కాంత తరంగాలు చాలా తక్కువ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి. రేడియోల్లోనూ, బల్బుల్లోనూ వాడేవే ఇందులోనూ వాడతారట.